జగిత్యాల, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి కలిశారు. శుక్రవారం ఎర్రవెల్లిలో భేటీ అయ్యారు. తమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. కాంగ్రెస్‌లో అవమానాలు తట్టుకోలేక, ఆత్మగౌరవం కోసం ఆ పార్టీని వీడిన జీవన్‌రెడ్డితో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలలో భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అధినేత కేసీఆర్‌తో సమావేశమైన తర్వాత బీఆర్ఎస్లో చేరే విషయంపై స్పష్టత వస్తుందని ప్రకటించారు.
కాగా, గురువారం రాత్రే కేసీఆర్.. జీవన్‌రెడ్డికి ఫోన్ చేసి శుక్రవారం ఎర్రవెల్లిలోని తన నివాసానికి రావాలని ఆహ్వానించారు. అలాగే జీవన్‌రెడ్డిని తీసుకొని రావాల్సిన బాధ్యతను బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతకు సూచించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం విద్యాసాగర్‌రావు, దావ వసంతతోపాటు తన ముగ్గురు కొడుకులతో కలిసి జీవన్‌రెడ్డి ఎర్రవెల్లికి చేరుకున్నారు.
కరీంనగర్ నుంచి కొప్పుల ఈశ్వర్, హైదరాబాద్ నుంచి ఎల్ రమణ, కోరుట్ల నుంచి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సైతం చేరుకున్నారు. కాగా, కేసీఆర్ నివాసానికి చేరుకున్న జీవన్‌రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రులు ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ తదితరులు స్వాగతం పలికారు. ఇంట్లోకి చేరుకున్న జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. నలభై ఐదేండ్లుగా కలిసి ప్రజాక్షేత్రంలో కొనసాగిన కేసీఆర్, జీవన్‌రెడ్డి పరస్పరం ఎదురైన సందర్భంలో భావోద్వేగానికి లోనయ్యారు.
‘తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నది. మీతో కలిసి పనిచేయమని ఆ దేవుడు నన్ను మీదగ్గరికి పంపించిండు అన్నా. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకైనా మీతో కలిసిపనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది అన్నా’ అంటూ తన మనసులోని మాటను మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు. చిరకాల మిత్రుడైన జీవన్‌రెడ్డిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని కేసీఆర్ శాలువాతో సన్మానించారు. అనంతరం ఇరువురు రాష్ట్రంలోని రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై లోతైన చర్చ సాగించారు.
ఆ తర్వాత జీవన్‌రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులతో సమావేశం అయ్యారు. జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరికపై చర్చించారు. రాష్ట్రంలో పరిస్థితులు, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ వైఖరి, హామీల ఎగవేత, సాగునీటి ఆవశ్యకత ఇలా అనేక అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ, జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిక విషయం స్పష్టమైందని, ఈ నెల 20వ తేదీలోగా జగిత్యాల పరిసర ప్రాంతాల్లో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఇదే వేదికగా జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరుతారని చెప్పారు.