కాంగ్రెస్ సర్కారు ప్రజాకంఠక పాలన కొనసాగిస్తున్నది. అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో ఏ ఒక్క హామీనీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. ఇవ్వాళ సీఎం రేవంత్‌రెడ్డి తీరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలోనే నెలకొన్న వివక్షపూరిత కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు విసిగిపోయి సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమని భావించి ఆయనతో కలిసి సాగేందుకు అంగీకరించారు.
నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో అనుక్షణం ప్రజలతో మమేకమైన జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తున్న తరుణంలో జగిత్యాల వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. లక్షలాది మందితో నిర్వహించే ఈ సభా వేదికపై నుంచి కేసీఆర్ మరోసారి సింహనాదం చేయబోతున్నారు. కేసీఆర్ సభకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది. అందుకే జగిత్యాల సభకు అడ్డంకులు సృష్టించేందుకు కుత్సిత బుద్ధితో కుటిల యత్నాలు చేస్తున్నారు.
ఆయనతోపాటు హైబ్రీడో.. క్రాస్బ్రీడో అర్థం కాని, ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని జగిత్యాల ఎమ్మెల్యే సైతం సభను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జగిత్యాల సభ భారీ విజయవంతమవుతుంది. ఈ గడ్డపై నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర, కాంగ్రెస్‌పై దండయాత్ర మొదలవుతుంది. ఈ సభలో పాల్గొనే జన ప్రభంజనంతో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోతుంది. ఇప్పటికే ప్రజల్లో సీఎం రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలన్న ఆకాంక్ష ప్రబలింది. జగిత్యాల సభతో కేసీఆర్ మరోసారి సీఎం కావడం పక్కా అని తేలుతుంది.
– మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్