చండీగఢ్: ఒక మహిళ థార్ వాహనాన్ని రివర్స్ చేసింది. పార్కింగ్ ఏరియాలో నిద్రిస్తున్న పని మనిషిపైకి ఆ వాహనాన్ని ఎక్కించింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించింది. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని తీసుకొచ్చి పార్కింగ్ ఏరియాలో పడేసింది. (Woman Run Over By Thar) హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. సెక్టార్ 67లోని విలాసవంతమైన అన్సల్ వర్సాలియా సొసైటీలో నివసించే ఒక మహిళ తన థార్ వాహనాన్ని రివర్స్ చేసింది. ఇంట్లో పనుల తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌లోని పార్కింగ్ ప్రాంతంలో నిద్రిస్తున్న పని మనిషి పైకి వాహనాన్ని ఎక్కించింది. గాయపడిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని మహోబాకు చెందిన పని మనిషి అయిన 57 ఏళ్ల గుడ్డి మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆ మహిళ గుడ్డి మృతదేహాన్ని థార్‌లో హౌసింగ్ సొసైటీ వద్దకు తీసుకొచ్చింది. ప్రమాదం జరిగిన పార్కింగ్ ప్రదేశంలో మృతదేహాన్ని ఉంచి వెళ్లిపోయింది.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న గుడ్డి బంధువులు ఆ మహిళ ఇంటి వద్ద నిరసన తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గుడ్డి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్ పార్కింగ్ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.