Harish Rao | తిమ్మాపూర్, జూన్ 16 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక కేసీఆర్ హయాంలో స్కీంలు చేపడితే కాంగ్రెస్ పాలనలో రేవంత్ సర్కారు స్కాంలకు పాల్పడుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్ లో మానకొండూర్ నియోజకవర్గ స్థాయి డిజిటల్ సభ్యత్వ నమోదు తో పాటు సర్ పై విస్తృత స్థాయి సన్నాహాక సమావేశం మంగళవారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావుకు అల్గునూర్ లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… మేనిఫెస్టోలో చెప్పని కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మీ లాంటి స్కీంలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తే… సివిల్ సప్లైలో, సింగరేణిలో, హామ్ రోడ్లలో, పిల్లలకు అన్నం పెట్టే గుడ్లలో, బట్టలలో స్కాంలు రేవంత్ సర్కాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉపాధి కూలీలకు రూ.12వేలు ఇవ్వడం లేదని, మహిళళను కోటీశ్వరులను చేస్తామన్న రేవంత్ కుటుంబం కోటీశ్వరులు అవుతున్నారని విమర్శించారు.
జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ సంక్షేమ మంత్రులకు తెలియకుండా స్కాంలు జరుగుతున్నాయని, జిల్లా పరువు పోతుందని, రూ.2వేల కోట్ల స్కాం జరిగినా వారికి తెలియలేదని, ఇందులో ఎనుమల వారిదే రాజ్యం నడుస్తోందన్నారు. పతకాల అమలుకు ఖజానా లేదంటున్న రేవంత్ ఫుట్ బాల్ ఆటకి, అందాల పోటీలకు, వాస్తు పేరుతో సచివాలయ పనులకు, పలుచోట్ల క్యాంపు ఆఫీసులకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడని, ఆయనకు రైతులు, మహిళల పట్ల, పేదల పట్ల మనస్సు లేదని విమర్శించారు. మన సొమ్మును ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలకు, ఎన్నికలకు, ఢిల్లీకి పంపిస్తున్నాడని ఆరోపించారు. కమీషన్లు రావని పేదల పథకాలు అమలు చేయడం లేదని, కమీషన్లు వచ్చే పనులను రేవంత్ చేపడుతున్నాడని విమర్శించారు. ఓట్లు పెట్టి దేవుణ్ణి మోసం చేసిన ఎగువేతల రేవంత్ రెడ్డి విద్యార్థులను, నిరుద్యోగులను, రైతులను. మోసం చేస్తున్నాడని అన్నారు.
ఎగవేతల రేవంత్ అంటే తనపై తిమ్మాపూర్ స్టేషన్ లో కేసు పెట్టినారని, ఇటీవల నోటీసులు ఇచ్చారని, ఆయన ఎగవేతల రేవంత్ అని మరోసారి అన్నారు. రైతు బంధు రూ.19వేల కోట్లు ఎగబెట్టారని అన్నారు. కేసీఆర్ హాయాంలో కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఏనాడు ఆపలేదని గుర్తు చేశారు. రైతు భీమా ప్రీమియం గడువు పూర్తయి నాలుగు నెలలు అయిందని, రైతులు చనిపోతే ఆ కుటుంభాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. డిస్కం పేరుతో రైతులకు విద్యుత్తు కోతను తీసుకురానున్నారని ఆరోపించారు. రిజర్వాయర్లు, మెయిన్ కెనాల్స్ పూర్తి చేసి వేల ఎకరాలకు నీరిచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వముదేనని, పిల్ల కాలువలు పూర్తి చేస్తే మరిన్ని ఎకరాలకు నీరు అందించవచ్చన్నారు. అడుగడుగునా రైతులను వేధిస్తున కాంగ్రెస్ కి ఎవరైనా ఓటు వేస్తారా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్న కాంగ్రెస్ ఓటమి అంచున ఉందన్నారు. వడ్లుకొనే తెలివిలేని రేవంత్ బీఆర్ఎస్ ని మొలకెత్తనివ్వనని అంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ పరిస్థితి ఆయనకు అర్థమైందని, ఆయన పని అయిపోయినందునే అధికారులు ఆయన మాట వినడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ బాగుండాలంటే బీఆర్ఎస్ మళ్లీ గెలిచి కేసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మానకొండూర్ నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా ఉద్యమం చేసినారని, 2001లో అన్నీ జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను గెలుపొందిన నియోజకవర్గములో కరుడుగట్టిన కార్యకర్తలున్నారని అన్నారు.
డిస్కం బూతం రాబోతుంది…
కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పదకొండు గంటలకు తగ్గిందని, రైతు డిస్కంను ప్రవేశపెట్టి ఆరు ఏడు గంటలకే కుదించనున్నారని తెలిపారు. రైతు డిస్కం పేరిట సోలార్, విండ్ పవర్ ఇచ్చేలా చూస్తున్నారని, రాత్రి పూట కరెంటు ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. రైతుల ఉసురు తీసేందుకు రైతు డిస్కంలను తీసుకురానున్నారని ఆరోపించారు. ఇలాంటి రేవంత్ కి రైతులు ఎవరైనా ఓటు వేస్తారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రైతులు సైతం కేసీఆర్ ని గుర్తు చేస్తున్నారని, రేవంత్ కి ఓటు వేసేందుకు సిద్దంగా లేరని ఆన్నారు.
రీఎంబర్స్ మెంట్..
రీఎంబర్స్ మెంట్ ని నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలల్లో సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. బలహీన వర్గాల పిల్లలంటే రేవంత్ కి ఇష్టం లేదన్నారు. ఇప్పటి వరకు సీఎం, మంత్రులు రీ ఎంబర్స్ మెంట్ విషయం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నత విద్యకు 30లక్షల మంది విద్యార్థులు దూరమై ఒక తరం వెనుకబడే ప్రమాదం ఉందన్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్న రేవంత్ సర్కారు పేద విద్యార్థులకు ఇవ్వడానికి మనస్సు రావడం లేదని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన రేవంత్ కేవంల 16వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు.
రిజర్వార్ల ఘనత మాదే…
తెలంగాణ ఏర్పడ్డాక రాష్ర్టాన్ని సస్యశ్యామం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, 23 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందంచినట్లు తెలిపారు. ప్రాజెక్టులు, ప్రధాన కాలువలు పూర్తి చేసినట్లు, పిల్ల కాలువలు అక్కడక్కడా పూర్తి చేస్తే మరిన్ని ఎకరాలకు నీరు అందించవచ్చన్నారు.
మన ఓట్లు జాగ్రత్త…
ప్రతీ 20 ఏళ్లకోసారి ఓటరు జాబితా సవరణ (సర్) ని ఎన్నికల కమీషన్ చేపడుతుందని, దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. విచారణ సమయంలో అధికారుల వెంట బీఆర్ఎస్ బూత్ ఇంచార్జీలు ఉండాలని సూచించారు. రివిజన్ సమయంలో ఇతర పార్టీల వారి పేర్లను తొలగించే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా గమనించాలని తెలిపారు. మన ఓట్లు పోకుండా చూసుకోవాలని, రివిజన్ విషయంలో ఓట్లు కోల్పోతే అప్పీలు చేసుకునే అవకాశం ఉందని, అప్పీలు ద్వారా ఓటు హక్కు తెచ్చుకోవచ్చన్నారు.
ఈ సమావేశమంలో బీఆర్ఎస్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణా రావు, ఇంచార్జీ రవీంధర్ రావు, కార్పోరేటర్ కాల్వ మల్లేశం, నాయకులు రవీందర్ సింగ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, చల్ల హరిశంకర్, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, రావుల రమేష్, సిద్దం వేణు, శేఖర్ గౌడ్, స్వామిరెడ్డి, ఏకానందం, నాయిని వెంకట రెడ్డి, రవీంధర్ రెడ్డి, వెంకన్న, మహిపాల్, రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, గడ్డం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.