రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలనలో కుదేలైన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కేసీఆర్ సర్కారు అనేక సంక్షేమ, త్రిఫ్ట్, సబ్సిడీపై నూలు లాంటి రాయితీ పథకాలతో ఊపిరిలూదింది. అప్పటి చేనేత జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ఇక్కడి కార్మికులకు చేతినిండా పనికల్పించేందుకు పదేండ్లలో 3 వేల కోట్ల విలువైన వస్త్ర ఆర్డర్లు ఇచ్చింది. ముఖ్యంగా బతుకమ్మ చీరెల తయారీని అప్పగించి టెక్స్టైల్స్ రంగాన్ని గట్టెక్కించింది. అలాగే, కేటీఆర్ సిరిసిల్లకు మెగా క్లస్టర్ ఇవ్వాలని పలుసార్లు కేంద్రమంత్రులను కలిసి విన్నవించారు.
నేతన్న దయనీయ పరిస్థితులను వివరించారు. అయినా బీజేపీ ప్రభుత్వం స్పందించలేదు. కార్మికులపై కరుణ చూపకపోగా నూలు నుంచి మొదలు వస్ర్తోత్పత్తులపై జీఎస్టీ పన్నుపోటు విధించి కార్మికుల పొట్టగొట్టింది. దీనిపై బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళనలు చేశారు. అయితే, సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రవేశపెట్టిన బడ్జెట్లో సిరిసిల్లలో మెగా పవర్‌లూం క్లస్టర్ ప్రకటిస్తుందని ఆశించారు. ఇంకా ఏమైనా చేయూతనిస్తారని భావించారు. కానీ, కేంద్రం ఈ విషయంపై ఎలాంటి ప్రస్తావన చేయకపోవడంతో ఇక సిరిసిల్లకు మెగా క్లస్టర్ కలేనని కార్మికులు నిర్వేదానికి లోనవుతున్నారు. ఇక్కడి ఎంపీ బండి సంజయ్ తీరుపై భగ్గుమంటున్నారు.
సిరిసిల్ల నేతన్నలను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఏనాడూ పట్టించుకోలేదు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నా మెగా క్లస్టర్ తేకపోవడం ఆయన అసమర్థతే. కేసీఆర్ ప్రభుత్వంలో చేనేత జౌళీశాఖ మంత్రి కేటీఆర్, అప్పటి కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అనేకసార్లు బీజేపీ ప్రభుత్వానికి లేఖలు రాశారు. స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. అయినా స్పందించలేదు. సిరిసిల్లకు మెగాక్లస్టర్ మంజూరు కాకపోవడంపై బండి సంజయ్ బాధ్యత వహించాలి. దేశ వ్యాప్తంగా టెక్స్టైల్ రంగం సంక్షభానికి బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణం.
– జిందం చక్రపాణి, బీఆర్ఎస్ పట్టణాధ్యాక్షుడు, వస్త్ర వ్యాపారి (సిరిసిల్ల)