హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 11 : కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైతులను మాత్రం రోడ్లపై నిలబెడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ పాలనలో రైతులకు కష్టాలు రాకుండా చూసుకున్నారని, నాట్ల సమయంలోనే యూరియా అందుబాటులో ఉంచారని గుర్తు చేశారు.
పదేళ్లలో ఏ ఒకరోజు కొరత రాలేదని, కానీ, ఇప్పుడెందుకు రైతులు పడిగాపులు గాయాల్సి వస్తున్నదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అసమర్థత వల్లే ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తామని హెచ్చరించారు.