కరీంనగర్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, తోట ఆగయ్య, కోరుకంటి చందర్ తమ అభిప్రాయాన్ని తెలుపగా, ధర్మారంలో మంత్రి కొప్పుల, ఇబ్రహీంపట్నంలో కోరుట్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించారు.
జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం.. మోదీ పాలనలో భ్రష్టు పట్టిన దేశాన్ని బాగు చేయడం కేసీఆర్‌తోనే సాధ్యం. ప్రజా సంక్షేమం కోసం పరితపించే ఆయన నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ మాదిరిగా దేశాన్ని అభివృద్ధి చేయడం కేసీఆర్‌తోనే సాధ్యం అవుతుంది. తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు ఇక్కడి పథకాలను చూసి రాష్ట్రంలో తమను విలీనం చేయమని కోరడమే కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శనం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకభూమిక పోషించాలని వివిధ రాష్ర్టాల్లోని రైతులు సైతం కోరుతున్నారు.
– రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
కేసీఆర్ పాలనను కోరుకుంటున్నరు..
తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, బీమా, 24 గంటల కరెంట్, ధాన్యం కొనుగోళ్లను చూసి దేశమంతా కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నది. ఒకవేళ ఇక్కడ బీజేపీ సర్కారు వస్తే పేదలకు ఈ పథకాలేవీ ఉండవు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న విధంగా పింఛన్ రూ.700లే ఇస్తరు. ఇక్కడ వ్యవసాయం పండగలా సాగుతుంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతు సంక్షేమ పథకాలేవీ అమలైతలేవు. కేంద్రం రైతు చట్టాలు తెచ్చి రైతుల ఉసురు తీయాలని చూసింది. మోటర్లకు మీటర్లు పెడతామంటున్నది. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనను రైతులు తిప్పి కొట్టాలి.
– కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు
దేశానికి ఎంతో మేలు జరుగుతది
సీఎం కేసీఆర్‌తోనే దేశప్రజలకు మేలు జరుగుతుంది. ఇక్కడి అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆయన పాలనను కోరుకుంటున్నారు. దేశమంతా పచ్చని పంట పొలాలతో తులతూగాలంటే ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలి. మహారాష్ట్రలోని రాజూర, వణి, బల్లార్షా ప్రజలు తెలంగాణలో విలీనం చేయాలని అక్కడి ప్రభుత్వాలను అడగడమే ఇందుకు నిదర్శనం. మహోన్నతమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. దేశంలోని రైతాంగాన్ని సాగునీటి కష్టాలను విముక్తి చేయడం ఆయనతోనే సాధ్యం. దేశంలోని ప్రతి పేద ఇంటికీ సంక్షేమ పథకాలు అందాలంటే కేసీఆర్ సారథ్యంలోనే సాధ్యం.
– కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు
కేసీఆర్ వెంటే కరీంనగర్ జిల్లా
పీవీ నర్సింహారావు వంటి గొప్ప వ్యక్తిని ప్రధాని పీఠం మీద కూర్చో బెట్టిన గొప్ప జిల్లా కరీంనగర్. తెలంగాణ ముద్దు బిడ్డ అయిన కేసీఆర్‌ను కూడా ఢిల్లీ పీఠం మీద కూర్చో బెట్టాలని ఆకాంక్షిస్తోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేసి ఈ దేశాన్ని మంచి దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినపుడు కరీంనగర్‌లోనే మొట్ట మొదటి సింహగర్జన సభకు పూర్తి మద్దతుగా నిలిచాం. దేశ రాజకీయాల్లో కరీంనగర్ జిల్లా ముద్ర వేసుకోవాలని మా జిల్లా ప్రజలు అభిలషిస్తున్నారు.
– జీవీ రామకృష్ణారావు, టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
దేశానికి రోల్‌మోడల్ తెలంగాణ
అపార రాజకీయ పరిజ్ఞానం, విశేష పాలనాదక్షత ఉన్న సీఎం కేసీఆర్‌తోనే దేశ పురోగతి సాధ్యం. దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ నాయత్వం వహించాల్సిందే. ఆయన ఆలోచనా విధానంతోనే తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఇది దేశమంతా విస్తరించాలి. తెలంగాణలాగే దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ నాయకత్వం కావాలని ఇతర దేశాలకు వెళ్లిన విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ నుంచి దేశ, విదేశాల్లో ఉన్న పారిశ్రామిక వేత్తలు, మేధావులు కోరుకుంటున్నారు.
– తోట ఆగయ్య, టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు