‘సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం’ అన్నారు మన పెద్దలు. శరీరంలోని అన్ని అవయవాల కంటే ముఖ్యమైనవి కండ్లు. అవి బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. వాతావరణంలో వచ్చే మార్పులు, మన అలవాట్లు ఇతరత్రా కారణాల వల్ల కంటి జబ్బులు పెరుగుతున్నాయి. పేదరికం వల్ల ఎంతో మంది తమ కంటి జబ్బులను పట్టించుకోకపోవడంతో చూపును కోల్పోయే ప్రమాదముంటున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘కంటి వెలుగు’ పేరిట ఒక గొప్ప కార్యక్రమాన్ని తెచ్చింది. 2018 ఆగస్టులో మొదటి విడుతను ప్రారంభించి, లక్షలాది మందికి ఉచితంగా పరీక్షలు చేయించింది. అవసరమైన వారికి అద్దాలు ఇవ్వడమే కాదు, శస్త్ర చికిత్సలు చేయించి కంటి చూపు కోల్పోయిన వారికి తిరిగి వెలుగును ప్రసాదించింది. ఈ నెల 18 నుంచి రెండో విడుతను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది.
కరీంనగర్, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న ప్రతి కార్యక్రమంలోనూ మానవీయ కోణం కనిపిస్తున్నది. కంటి వెలుగు కార్యక్రమం కూడా అలాంటిదే. కంటి జబ్బులు తీవ్రంగా వేధిస్తున్న ఈ రోజుల్లో వాటిని పట్టించుకోకుండా ఉంటే చూపు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. వైద్యానికి డబ్బులు లేక పోవడం, దవాఖానల చుట్టూ తిరిగే సమయం దొరక్కపోవడం వంటి కారణాలతో చాలా మంది కంటి జబ్బులను పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు మొదటి విడుత ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి కంటి చూపును ప్రసాదించింది. ముఖ్యంగా అరవై ఏండ్ల పైబడిన వృద్ధులకు కంటి వెలుగు ఒక వరంగా మారింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా అన్నిచోట్లా ప్రజల వద్దకే వెళ్లి కంటి పరీక్షలు చేయడం, అవసరమైన మందులు, కంటి అద్దాలే కాకుండా తీవ్రమైన జబ్బులు ఉంటే శస్త్ర చికిత్సలు కూడా పూర్తి ఉచితంగా చేశారు.
మొదటి విడుత విజయవంతం
2018 ఆగస్టు 15 నుంచి 2019 ఫిబ్రవరి 22 వరకు మొదటి విడుత కంటి వెలుగు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం ద్వారా నిర్వహించిన కంటి వెలుగులో పంచాయతీ, మున్సిపల్ శాఖలు కూడా పాలు పంచుకున్నాయి. ఉమ్మడి జిల్లా జనాభా 33,51,553 మంది ఉండగా, కరీంనగర్ జిల్లాలో 5,49,029, జగిత్యాలలో 6,47,684, సిరిసిల్లలో 3,29,734, పెద్దపల్లిలో 3,85,920 మందికి కంటి పరీక్షలు చేశారు. అందులో 2,91,608 మందికి రీడింగ్ కంటి అద్దాలు, 1,91,234 మందికి పాయింటెడ్ అద్దాలు అందించారు. అంతే కాకుండా 82,820 మందికి ఆపరేషన్లు అవసరం ఉన్నట్లు గుర్తించి, చాలా మందికి ఆపరేషన్లు చేశారు. చూపు మందగించిన ఎందరికో కంటి అద్దాలు ఇవ్వడం వల్ల ఇపుడు వారు ఎంతో బాగా చూడగలుగుతున్నారు.
రెండో విడుతకు సన్నద్ధం
అవాయిడేబుల్ బ్లైండ్నెస్ ఫ్రీ తెలంగాణ దిశగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుతగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నది. మొదటి విడుత ఐదారు నెలలు నిర్వహించగా, ఈ సారి వంద రోజుల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 18న ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అప్పటి నుంచే కార్యక్రమం ప్రారంభమవుతుంది. కార్యక్రమానికి ఆయా జిల్లాల అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సార్వత్రిక కంటి వెలుగు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు, శస్త్ర చికిత్సలు నిర్వహించాలనే లక్ష్యంతో చేపడుతున్నారు. గ్రామ పంచాయతీ మొదలుకుని మండల స్థాయి, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల స్థాయిలో ఇప్పటికే ఆయా పాలకవర్గాలు సమీక్షించి విజయవంతం చేసేందుకు ఆయా స్థాయిల్లో ప్రణాళికలు చేసుకుంటున్నారు. వంద రోజుల్లో ఆయా జిల్లాల ప్రజలందరికీ పరీక్షలు నిర్వహించేందుకు ఈ సారి అధికారులు ఎక్కువ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.
నందమ్మకు నయనానందం..
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు పారునంది నందమ్మ. ఊరు తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి. నందమ్మకు అరవై ఏండ్లు దాటాయి. వృద్ధాప్యం కారణంగా కంటి చూపు మందగించింది. ఐదారేండ్లుగా ఇబ్బంది పడుతున్న నందమ్మకు మొదటి విడుత కంటి వెలుగులో వైద్యులు పరీక్షించారు. కంటి చూపు దెబ్బతిన్నట్లు గుర్తించి అవసరమైన మందులు ఇచ్చారు. పాయింటెడ్ అద్దాలు తయారు చేయించి, ఇంటికి తీసుకెళ్లి మరీ అందించారు. ఆ సమయంలో నందమ్మ పట్టరాని ఆనందం పొందింది. ఇక చూడలేను అనుకున్న ఆమె కంటి వెలుగు అద్దాలతో చూడగలుగుతున్నది. ఇప్పుడు అవే అద్దాలను అపురూపంగా చూసుకుంటున్నది. ఎందుకంటే వాటిని కాపాడుకుంటేనే ఆమెకు వెలుగు. ‘కేసీఆర్ సార్ దయతో కంటి వెలుగులో నాకు కండ్లద్దాలు ఇచ్చిన్రు. కండ్లు మునుపటి కంటే చాలా బాగా కనబడుతున్నయ్. ఈ విడుతలో మళ్లీ పరీక్షలు చేయించుకుంట. అవసరమైన ఆపరేషన్ కూడా చేయించుకుంట’ అని నందమ్మ ధీమాగా చెబుతున్నది.
చూపు మంచిగా అగుపడుతంది
నాపేరు భూసారపు రాజలింగం. నాకు 87 ఏండ్లు. మాది హుజూరాబాద్‌లోని శివాజీనగర్. నాకు నాలుగేండ్ల కింద కుడి కన్ను కనిపించకపోతే కంటి వెలుగులో ఆపరేషన్ చేయించుకున్న. ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రభుత్వమే చేయించింది. కంటి వెలుగుల ఆపరేషన్ చేస్తే కండ్లు పోతాయని, సరిగ్గా కనిపించవని కొందరు నన్ను ఆగంపట్టిచ్చినా వినకుండా రేకుర్తి దవాఖానకు పోయి చేయించుకున్న. కన్ను మంచిగైంది. చూపు మంచిగా అగుపడుతంది. వయసు మీద పడ్డది కదా.. ఇప్పుడు ఎడమ కన్నుకూడా కానస్తలేదు. ఇప్పుడు మళ్లొకసారి కంటి వెలుగు పెడుతున్నరని తెలిసింది. చానా సంతోషమనిపించింది. కానీ, వయసుమీద పడ్డది కదా ఎడమకన్ను ఆపరేషన్ చేస్తరో లేదోనని బెంగగా ఉంది. కానీ ఎవరెన్ని చెప్పినా కేసీఆర్ సారు మాత్రం మాసోంటోళ్ల కోసం మంచి పనిచేస్తున్నరు. ఈపారి కంటి వెలుగుల సార్లు దయతలిస్తే ఎడమ కన్నుకు కూడా ఆపరేషన్ చేయించుకుంట.