కరీంనగర్ కార్పొరేషన్, జూలై 16 : కరీంనగర్ నరగపాలక సంస్థ రెవెన్యూ అధికారులు ఇంటి నంబర్ల కేటాయింపులో సరికొత్త దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. ఆన్లైన్లో స్వీయ మదింపును తమకు అనుకూలంగా మార్చుకొని, ఇంటి నంబర్ల కోసం రూ.లక్షల్లోనే ముడుపులు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా ఇంటి నంబర్ల కేటాయింపునకు ఏ దరఖాస్తుదారుడైనా ఆన్లైన్లో స్వీయ మదింపు చేసుకొనే అవకాశముంటుంది. దీనిపై ఆయా ఏరియా ఆర్ఐ, ఆర్ఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇస్తే, దానిని ఆ విభాగం పర్యవేక్షించే ఉన్నతాధికారి ఇంటి నంబర్ల ను కేటాయిస్తారు. అయితే, ఒక వేళ అధికారులు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తును పరిశీలించకపోతే 15 రోజుల్లో దరఖాస్తుదారుడికి ఇంటి నంబర్ కేటాయింపు జరిగిపోతుంది. కాగా, ఇక్కడే ఈ విభాగం అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తున్నది. మార్చిలో రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది అంతా ఆస్తి పన్నుల వసూళ్లలో బిజీగా ఉన్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ఈ విభాగంలోని కొందరు అధికారులు అడ్డదారి తొక్కారు.
నిబంధనలకు విరుద్ధంగా ఓ విలీన గ్రామంలో సింగిల్ షెడ్స్ ఉన్న 70 దరఖాస్తులకు ఇంటి నంబర్లు కేటాయించారు. ఈ విషయంలో ఏప్రిల్లో ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నామంటూ హడావుడి చేశారు. కానీ, ఈ విషయంలో ఎలాంటి ముందడుగు వేయలేదని సమాచారం. దరఖాస్తు వచ్చిన 15 రోజుల్లో వాటిని పరిశీలించకపోవడంతో ఇంటి నంబర్ కేటాయింపు జరిగిందని చెప్పి, నివేదిక ఇచ్చినట్టు తెలుస్తున్నది. కాగా, వీటిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉన్నా దానిని పక్కన పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. కాగా, ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయన్న ప్రచారం సాగుతున్నది. కాగా, ఇప్పుడు ఏకంగా ఆ 70 ఇంటి నంబర్లకు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారని ఆ విభాగంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నగరపాలక ఉన్నతాధికారులు రెవెన్యూ విభాగంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇచ్చిన ఇంటి నంబర్ల విషయంలో విచారణ చేపడితే భారీగా అక్రమ ఇంటి నంబర్లు బయటపడే అవకాశాలున్నాయి.