జగిత్యాల, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/ జగిత్యాల : ప్రగతి రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జగిత్యాలలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30గంటలకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత 12.55కి బయలుదేరి, ఒంటి గంటకు 119 కోట్లతో 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న మెడికల్ కాలేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. 1.15గంటలకు 49.20 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, 3 గంటలకు మోతె శివారులోని సభా స్థలానికి బయలు దేరుతారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించి, 4గంటలకు తిరిగి హైదరాబాద్ పయనమవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయగా, మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. మరోవైపు లక్షలాది మందిని సభకు తరలించేందుకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అంతా సిద్ధం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి జగిత్యాల పర్యటనకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొననుండగా, అందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదట హౌసింగ్‌బోర్డు సమీపంలో నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనుండగా, అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత సమీకృత కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేయనుండగా, భవనాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రెండు రోజుల క్రితమే విద్యుద్దీపాలు వేశారు. మంగళవారం ఉదయమే వివిధ రకాల పూలను తెప్పించి అన్ని శాఖల గదులను అలంకరించారు. సీఎం కేసీఆర్ పూజాదికాలు నిర్వహించే హాల్‌తోపాటు సమీక్ష హాల్, కలెక్టర్ చాంబర్‌ను ప్రత్యేకంగా అలంకరించారు.
భారీగా జనసమీకరణ
సీఎం సభను సక్సెస్ చేసేందుకు నేతలంతా సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడిజిల్లాతోపాటు నిజామాబాద్ నుంచి లక్షలాది మంది తరలిరానున్నారు. ప్రతిపల్లె, మండలం నుంచి గులాబీ దండు పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాట్లు చేసి, దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకంగా వాహనాలను కూడా సిద్ధం చేశారు. జగిత్యాల నియోజకవర్గం నుంచి 50 వేలు, ధర్మపురి నుంచి 40 వేలు, కోరుట్ల నుంచి 30 వేలు, చొప్పదండి నుంచి 30 వేలు, పెద్దపల్లి జిల్లా నుంచి 30 వేలు, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 60 వేల మంది వచ్చేలా నియోజకవర్గాల వారీగా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 2 లక్షల మందికి పైగా సభకు వచ్చేలా నియోజకవర్గాల వారీగా వాహనాలను సమకూర్చుతున్నారు.
మోతె శివారులో భారీ బహిరంగ సభ
మధ్యాహ్నం జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామ శివారులో సీఎం భారీ బహిరంగ సభకు అంతా సిద్ధం చేశారు. మోతె గ్రామ శివారులో ఉన్న 30 ఎకరాల స్థలాన్ని సిద్ధంగా ఉంచారు. తూర్పునకు అభిముఖంగా భారీ డయాస్‌ను ఏర్పాటు చేశారు. డయాస్‌కు కుడివైపులో కళాకారుల బృందాల ప్రదర్శన కోసం ప్రత్యేక వేదికను రూపొందించారు. ముందు భాగంలో దాదాపు ముప్పై మీటర్ల వరకు ఖాళీ స్థలాన్ని వదిలివేసి తదుపరి గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సభా స్థలి చుట్టూ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ ఖాళీ స్థలం ముందే మీడియా, ఫొటో గ్రాఫర్స్ కోసం ఏర్పాట్లు చేశారు. ఇక జగిత్యాల బైపాస్ నుంచి మోతె సభా స్థలి వరకు రోడ్డుకిరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే మైక్ సౌండ్ సిస్టమ్ కోసం జనరేటర్లను ఏర్పాటు చేశారు. సభాస్థలి చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేయడంతోపాటు భారీ సౌండ్ సిస్టమ్‌ను అమర్చారు.
జగిత్యాల గులాబీమయం
సీఎం పర్యటన నేపథ్యంలో జగిత్యాల గులాబీమయంగా మారింది. సీఎం కలెక్టరేట్ ప్రారంభోత్సవం తర్వాత రోడ్డుమార్గాన బైపాస్ మీదుగా సభా స్థలికి చేరుకోనుండగా, దారి పొడవునా ఫ్లెక్సీలతో నింపేశారు. అలాగే కరీంనగర్ రోడ్డు, బైపాస్ రోడ్డు, మోతె రోడ్డుతోపాటు పట్టణంలోని అన్ని ప్రధాన రోడ్లకిరువైపులా స్వాగత ఫ్లెక్సీలు కట్టారు. ఇక పట్టణాన్ని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అందంగా ముస్తాబు చేశారు. కూడళ్లను విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. చౌరస్తాల వద్ద తోరణాలు కట్టారు. మురుగు కాలువలతోపాటు రోడ్లను చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేశారు.
విజయవంతం చేయండహో..
జగిత్యాలలో బుధవారం సీఎం కేసీఆర్ పాల్గొనే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్(బీఆర్ఎస్) సీనియర్ నాయకుడు జీఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం డబ్బు చాటింపు చేశారు. కరీంనగర్‌లోని తెలంగాణచౌక్ నుంచి టవర్ సర్కిల్, కోర్టు చౌరస్తాలో చాటింపు వేశారు. మేధావులు, కవులు, కళాకారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కుల బాంధవులు అధిక సంఖ్యలో జగిత్యాలకు తరలి రావాని కోరారు.ఇక్కడ టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు రాజిరెడ్డి, శ్రావణ్, సతీశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రత్యేకంగా పార్కింగ్
సభా స్థలికి ఎనిమిది వైపులా పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. సభా స్థలికి సమీపంలో వీఐపీ, ప్రెస్ పార్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ధర్మపురి, పెద్దపల్లి వైపు నుంచి వచ్చే వాహనాల కోసం సభా స్థలికి ఈశాన్యం వైపు పార్కింగ్ కేటాయించారు. చొప్పదండి, కరీంనగర్ నుంచి వచ్చే వాటికి ఆగ్నేయంలో మోతె శివారులో పార్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆర్మూర్, బాల్కొండ, మెట్పల్లి వైపు నుంచి వచ్చేవారికి వాయువ్య ప్రాంతంలో జగిత్యాల పట్టణానికి సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. వేములవాడ వైపు నుంచి వచ్చే వాటికి నైరుతి భాగంలో ఏర్పాట్లు చేశారు. భారీ వాహనాలకు ఒక పార్కింగ్ కేంద్రాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలకు వేరేగా పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన వాహనాల పార్కింగ్ కోసం క్యూఆర్ కోడ్‌ను ఇచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ ఆధారంగా పార్కింగ్ కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, అధికారులు
రాష్ట్రస్థాయి అధికారులు, సీఎంవో అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. పలువురు ఐఏఎస్ అధికారులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని పరిశీలించి, కలెక్టర్ జీ రవికి సూచనలు చేశారు. ఇక కలెక్టరేట్‌తో పాటు సభాస్థలిని పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాలలోనే నాలుగు రోజులుగా మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేతకాని, టీఆర్ఎస్ జిల్లా శాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సంజయ్‌కుమార్, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ఫైనాన్స్ కమిటీ అధ్యక్షుడు రాజేశంగౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. మరోవైపు సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు నాయకులు, అధికారులు ఏర్పాట్లు చేశారు.
భారీ బందోబస్తు
జగిత్యాల కలెక్టరేట్ : సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును సిద్ధంగా ఉంచారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటించే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ భవన్, శంకుస్థాపన చేయనున్న మెడికల్ కాలేజీ భవన స్థలం, బహిరంగ సభ జరిగే మోతె ఏరియాలో భారీగా మోహరించారు. జగిత్యాలకు చేరుకునే రహదారులతోపాటు కూడళ్ల వద్ద పహారా కాస్తున్నారు. ఐజీ నాగిరెడ్డి మంగళవారం సాయంత్రం పరిశీలించి, పోలీసు అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎస్పీ సింధూశర్మ, డీఎస్పీ ఆర్ ప్రకాశ్‌కు పలు సూచనలు చేశారు. సమీకృత కలెక్టరేట్ వద్ద సీఎంకు గౌరవ వందనం సమర్పించేందుకు గాను పోలీసులు రిహార్సల్స్ చేశారు.