హుజూరాబాద్టౌన్, జూలై 8: బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని హుజూరాబాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ అబ్దుల్గఫార్ సూచించారు. శుక్రవారం నమాజు తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ గోవధను చేయకూడదని పిలుపునిచ్చారు. దేశంలో హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉండే వాతావరణం కల్పించాలన్నారు. గోవధ నిషేధ చట్టం 1977 ప్రకారం నడుచుకోవాలని కోరారు. ఖుర్బానీలో ఆవులు ఇవ్వకూడదని ఉలేమాలు(మత గురువులు) తమ బయాన్లో గుర్తు చేశారని చెప్పారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ముస్లిం సోదరులందరూ తమ శక్తి మేరకు మేకలు, గొర్రెలను ఖుర్బానీ కోసం వాడాలని తెలిపారు. గంగా జమున తెహజీబ్ వెళ్లి విరిసేలా ముస్లింలందరూ హిందువులకు శుభాకాంక్షలు తెలుపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రహీం, సెక్రటరీ ఎండీ ముస్తాక్, కార్యవర్గ సభ్యులు అబ్దుల్ మతీన్, ఎండీ సర్వర్, ఎండీ అశ్రఫ్, ఎండీ అఫ్సర్, ఖాజాపాషా, లాల్ మొహమ్మద్ పాల్గొన్నారు.
గోవధ నిషేధ చట్టాన్ని విధిగా పాటించాలి
కలెక్టరేట్, జూలై 8 : గోవధ నిషేధ చట్టాన్ని ప్రతి ముస్లిం విధిగా పాటించాలని సదర్ ఖాజీ హఫీజ్ మంఖబత్శాఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. గంగా జమున తెహజీబ్ మత సామరస్యాన్ని పాటిస్తూ బక్రీద్ పండుగ జరుపుకోవాలన్నారు. ఈద్ సందర్భంగా ఖుర్భానీ పేర ఆవులను వధించడం సముచితం కాదన్నారు. దేశంలోని చట్టాలను గౌరవిస్తూ, దేశ సమైక్యత, సమగ్రత కోసం కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అన్ని మతాల వారిని గౌరవించినపుడే సమాజంలో ముస్లింలకు గౌరవం లభిస్తుందన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ, విధిగా మాస్కులు ధరించి ప్రార్థనల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.