కరీంనగర్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్రవారం కుండపోత కురిసింది. సాయంత్రం అక్కడక్కడ భారీ వాన పడింది. జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం పూడూర్లో అత్యధికంగా 87.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మల్లాపూర్ మండలంలో 77.3, ధర్మపురి మండలం నేరెళ్లలో 68.3, బుర్దేశ్పల్లిలో 67.0, జగిత్యాల జిల్లా కేద్రంలో 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొ డిమ్యాల మండలంలోని కోనాపూర్ గ్రామానికి వెళ్లే దారిలో వాగు ఉప్పొంగి ప్రవహించడంతో దాటలేని పరిస్థితి నెలకొన్నది.
తుర్కాశీనగర్ శివారులో జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకూలింది. ఇదే సమయంలో నమిలికొండ శివారులో వేసిన రైల్వేగేటు మొరాయించింది. దీంతో రహదారిపై గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు మూడు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి.
కరీంనగర్లో రెండు గంటల పాటు వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
గంగాధర సమీపంలో ని మధురానగర్ వద్ద కరీంనగర్, జగిత్యాల రహదారి పైచెట్టు విరిగిపడి కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి రోడ్లపై వరద ప్రవహించింది. ఇటు శంకరపట్నం మండలంలో కూడా ఇదే పరిస్థి తి పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయంగా మారాయి. కేశవపట్నంలో అయితే మోకాలు లోతుతో వరద నీరు ప్రవహించింది. తిమ్మాపూర్, మానకొండూర్, గన్నేరువరం మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది. గన్నేరువరంలో పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షానికి పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
సిరిసిల్ల పట్టణంలో సాయంత్రం 4గంటలకు భారీ వాన పడింది. తర్వాత ముసురు అందుకుంది. దాదాపు అన్ని మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా సిరిసిల్ల పట్టణంలో 40.6 మిల్లీ మీటర్లు, ముస్తాబాద్ 20.9, ఇల్లంతకుంట 8.4, వీర్నపల్లి 29.1 కోనరావుపేట 0.2, రుద్రంగి 4, చందుర్తి 10, వేములవాడ రూరల్ 11.3, బోయినిపల్లి 18.2, వేములవాడ 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.