కమాన్ చౌరస్తా, అక్టోబర్ 17 : ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు మూడేళ్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కరీంనగర్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం యజమానులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి నగరంలో భారీ ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో డిగ్రీ, పీజీ కాలేజీలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, జీతాల చెల్లింపు, భవనాల అద్దెలు, నిర్వహణ కూడా కష్టంగా మారిందని వాపోయారు. అధికారులు, మంత్రులను కలిసి విన్నవించినా కనీస స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించాలని, తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ, పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి ఎస్ నరేశ్, డిగ్రీ కళాశాలల కరీంనగర్ జిల్లా కో-ఆర్డినేటర్ గోవిందవరం కృష్ణ, రవీందర్ రెడ్డి, వేణు, సతీశ్ కుమార్, ప్రిన్సిపాల్స్ వర్మ, ఎల్ శ్రీనివాస్, వేణుగోపాల్ రెడ్డి, చైతన్య, మనోహర్, చంద్రశేఖర్ రెడ్డి, నరేశ్, సీహెచ్ శ్రీనివాస్, జీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.