కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 15 : సమాజ హితం కోసం నిత్యం ఏదో ఒక సామాజిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వార్తల్లో నిలిచే కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి.. తాజాగా, భ్రూణహత్యలపై ఆలపించిన పాట అందరినీ ఆకట్టుకున్నారు. సమాజంలో ఆడపిల్లల శాతం తగ్గుతున్న క్రమంలో ప్రముఖ హిందీ రచయిత స్వానంద్ కిర్కిరే రాసి, పాడిన పాటను ప్రభుత్వ ఉపాధ్యాయుడు నంది శ్రీనివాస్ తెలుగులోకి అనువదించగా.. ‘ఓ చిన్ని పిచ్చుక.. చిన్నారి పిచ్చుక’ అంటూ కలెక్టర్ పమేలా తస్పతి స్వయంగా ఆలపించారు. ప్రపంచ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పాట పాడారు. మహిళలు, బాలికల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్, ఇప్పటికే వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సభలు నిర్వహిస్తూ.. మహిళల సమస్యలు తెలుసుకొని అప్పటికప్పుడే పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. బాలికా విద్యను ప్రోత్సహిస్తున్నారు. నిరక్షరాస్యులైన మహిళా సంఘాల్లోని మహిళలకు చదవడం, రాయడం నేర్పించడంలాంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ, వారిలో ఆత్మవిశ్వాసం రగిలించేందుకు కృషి చేస్తున్నారు. తాజాగా, భ్రూణ హత్యలపై అవగాహన కల్పించే లక్ష్యంతో తనదైన శైలిలో పాట పాడి ఆకట్టుకున్నారు. సమావేశంలో పాల్గొన్న చిన్నారుల తల్లిదండ్రులు, అధికారులు.. కలెక్టర్ పమేలా సత్పతిని అభినందించారు. కాగా, ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.