కొడిమ్యాల/కొత్తపల్లి, మే 1: ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి.. ఉత్తమాటలు.. ఉద్దెరహామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ను మరోసారి నమ్మి మోసపోవద్దని, పదేళ్ల పాలనలో తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ మాయలో పడొద్దని ప్రజలకు కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. ఆ రెండు పార్టీల మాయలో పడితే నిండామునగక తప్పదని హెచ్చరించారు. ఇకడ చోటే భాయ్ రేవంత్ రెడ్డి, ఢిల్లీలో బడే భాయ్ మోడీ కలిసి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తరని ధ్వజమెత్తారు. నదుల అనుసంధానం పేరిట బీజేపీ కొత్త నాటకం ఆడుతున్నదని, గోదావరి నీళ్లను కాపాడుకోవాలంటే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక ఉండాలని స్పష్టం చేశారు. బుధవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాలతోపాటు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో రోడ్‌షోలు నిర్వహించారు. ఆయా చోట్ల జనం నీరాజనం పలుకగా.. వారినుద్దేశించి వినోద్ మాట్లాడారు. గోదావరి నీళ్లను కృష్ణా నది మీదుగా కావేరి నదిలో కలిపి తమిళనాడుకు తరలించే కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు.
మన గోదావరి నీళ్లను ఎత్తుకుపోవడానికి అది మోడీ సొమ్ము కాదని మండిపడ్డారు. ఇదే జరిగితే తెలంగాణ ఎడారి అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి నీళ్లను కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ అభ్యర్థినైన తనను గెలిపించాలని కోరారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల ఉండాలని, కానీ తొమ్మిది పూర్వపు జిల్లాల్లోనే ఉన్నాయని, ఇంకా 23 స్కూల్స్ ఏర్పాటు కాలేదన్నారు. రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ ఒక నవోదయ పాఠశాల తేలేక పోయారని దుయ్యబట్టారు. పదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. తాను 2014నుంచి 2019 వరకు ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్‌కు రూ.వెయ్యి కోట్లతో స్మార్ట్ సిటీ, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్, కరీంనగర్లో రూ.50 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. జాతీయ రహదారులు కూడా తీసుకువచ్చానని పేర్కొన్నారు.
కొండగట్టు దేవస్థానానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో మాట్లాడి తాను 334 ఎకరాల ఫారెస్ట్ భూమిని ఇప్పించినట్లు గుర్తుచేశారు. కానీ, హిందుత్వం పేరు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకొనే బండి సంజయ్ మాత్రం ఇప్పటికీ నయాపైసా తీసుకురాలేదన్నారు. ఎన్నికలు వస్తేనే దేవుడు గుర్తుకు వచ్చే ఆయన ఐదేళ్ల పాలనలో ఒక గుడి తేలేదని, ఒక బడికి సైతం నిధులు ఇప్పించలేదన్నారు. ఉప్పల్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఐదేండ్లలో ఎంపీగా ఉండి కూడా సంజయ్ పూర్తి చేయించలేకపోయారని విమర్శించారు. రాబోయే తరాలు బాగుండాలని, పిల్లల భవిష్యత్ కోసం కేసీఆర్ ఆలోచన చేసి రాష్ట్రంలో 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా మరోసారి మోసం చేయడానికి ఎంపీ ఎన్నికలకు వస్తున్నదని, ప్రజలు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని సూచించారు.
బీజేపీ దొంగ మాటలు.. కాంగ్రెస్ గారడీ మాయలో పడి మరోసారి మోసపోవద్దని ప్రజలు అనుకుంటున్నరు. మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నరు. గత ఎన్నికల్లో మోసం చేసి గెలిచిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నరు. దేశంతో పాటు రాష్ట్రంలోని అన్ని విషయాలపై సమగ్రమైన అవగాహన ఉన్న వినోద్‌కుమార్‌ను కరీంనగర్ ఎంపీగా గెలిపించాలి. పదేండ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. త్వరలోనే ఆయన మళ్లీ సీఎం అవుతారు.
– చింతకుంటలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించాలంటే కరీంనగర్ ఎంపీగా వినోద్‌కుమార్‌ను గెలిపించాలి. బీజేపీ దొంగ మాటలు, కాంగ్రెస్ గారడీ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు. కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ వచ్చి ఆగం చేసింది. బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది. ఆ రెండు పార్టీలను నమ్మొద్దు.
– కొడిమ్యాలలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
చొప్పదండి నియోజకర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత వినోద్కుమార్దే. కొండగట్టు ఆలయ అభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి బాటలు వేసిండు. ఎన్నికలు వస్తేనే సంజయ్‌కు దేవుడు గుర్తుకు వస్తడు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఈ ఎన్నికల్లో వినోద్‌కుమార్‌ను గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలి.
– కొడిమ్యాలలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్