దృష్టి లోపాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత అట్టహాసంగా మొదలైంది. బుధవారం సీఎం కేసీఆర్ ఖమ్మంలో అంకురార్పణ చేయగా, గురువారం పల్లెపల్లెనా పండుగలా ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో ఊరూరా ఏర్పాటు చేసిన శిబిరాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రిబ్బన్ కట్ చేసి స్టార్ట్ చేయగా, ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, వీణవంక, జమ్మికుంటలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి నియోజకవర్గంలో సుంకె రవిశంకర్ ప్రారంభించగా, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ముందు నుంచే విస్తృత ప్రచారం చేయడం, ఇంటింటికీ ఆహ్వాన పత్రికలు అందించడంతో ఉదయం నుంచే శిబిరాలకు బారులు తీరారు. రూపాయి ఖర్చు లేకుండా పరీక్షలు చేసి మందులు, కండ్లద్దాలు అందజేయడంతో సంబురపడ్డారు.
కరీంనగర్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : కంటి వెలుగు రెండో విడుత అట్టహాసంగా మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఖమ్మంలో అంకురార్పణ చేయగా, గురువారం నుంచి అంతటా శిబిరాలను పండుగ వాతావరణంలో ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన 42 శిబిరాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ప్రారంభించారు. కరీంనగర్ డివిజన్లో 17, హుజూరాబాద్ డివిజన్లో 12, కరీంనగర్ నగర పాలక సంస్థలో 13 చోట్ల శిబిరాలు ఏర్పాటు చేశారు. మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్‌లోని 42వ డివిజన్లోని ఇంద్రానగర్ కాలనీ అంబేద్కర్ కమ్యూనిటీహాల్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వీణవంక, జమ్మికుంటలో, జడ్పీ అధ్యక్షురాలు విజయ ఇల్లందకుంట సిర్సేడులో, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానకొండూర్‌లో, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర మండలం బూరుగుపల్లిలో కంటి వెలుగు కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు.
కొత్తపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్ రాజేశం పరిశీలించారు. ముందుగానే విస్తృతంగా ప్రచారం చేయడం, ఇంటింటికీ ఆహ్వాన పత్రికలు అందజేయడంతో జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం 8గంటల నుంచే శిబిరాలకు చేరుకున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు టెస్టులు చేయగా, పేద, ధనిక అన్న తేడా లేకుండా వచ్చి తమ కండ్లకు పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షలు నిర్వహించిన వైద్య బృందాలు, అవసరం ఉన్న వారికి మందులు, రీడింగ్ గ్లాసులు అందించారు. పాయింట్ ఎక్కువ ఉన్న వారి వివరాలను నమోదు చేసుకుని ఆర్డర్‌పై తెప్పించి ఇస్తామని వైద్యులు చెప్పారు.
మొదటి రోజు 42 చోట్ల శిబిరాలు
జిల్లాలో మొత్తం 48 వైద్య బృందాలు, మరో 4 బఫర్ బృందాలను ఏర్పాటు చేశారు. 42 చోట్ల శిబిరాలను ప్రారంభించారు. అందులో కరీంనగర్ డివిజన్లోని తిమ్మాపూర్‌లో 2, రామడుగులో 3, మానకొండూర్‌లో 3, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, చొప్పదండి, గన్నేరువరంలో ఒకటి చొప్పున, గంగాధరలో 3, చిగురుమామిడిలో 2 చొప్పున 17 శిబిరాలను ప్రారంభించారు. ఇక హుజూరాబాద్ డివిజన్లోని వీణవంక, జమ్మికుంట, శంకరపట్నం, సైదాపూర్, ఇల్లందకుంట, హుజూరాబాద్‌లో రెండు శిబిరాల చొప్పున 12 ప్రారంభించారు. కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో 13 శిబిరాలను ప్రారంభించారు.
మొదటి రోజు 5183 మందికి స్క్రీనింగ్ పరీక్షలు
విద్యానగర్, జనవరి 19 : మొదటి రోజు జిల్లాలో 2448 పురుషులు, 2745 మహిళలు మొత్తం 5183 మందికి స్రీనింగ్ పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ జువేరియా తెలిపారు. రీడింగ్ లోపం ఉన్న 1085కి రీడింగ్ గ్లాసెస్ అందించగా, 855 ప్రిస్రైబ్ కండ్లద్దాలను సూచించినట్లు చెప్పారు. వీరికి వారం రోజుల్లోగా ఇండ్లకు పంపిస్తామని తెలిపారు. 3353 మందికి ఎలాంటి దృష్టి లోపాలు లేవని, జిల్లాలో 48 క్యాంపులు నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు.
పరీక్షలు ఇలా..
ప్రతి శిబిరంలో ఐదు కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొదటి టేబుల్ వద్ద ఆధార్ కార్డులో ఉన్న వివరాల ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రెండో టేబుల్లో ఆశా వర్కర్లు కంటి చూపును పరీక్షిస్తున్నారు. చీటీపై వివరాలను నమోదు చేస్తున్నారు. మూడో టేబుల్ వద్ద మెడికల్ ఆఫీసర్ పరిశీలించి, ఆ రిపోర్ట్ ఆధారంగా మందులు రాస్తున్నారు. అక్కడే ఉన్న ఏఎన్ఎం మందులు ఇస్తున్నారు. కంటి సమస్య ఉన్నట్లయితే నాలుగో టేబుల్ వద్ద ఉండే ఆప్తమెట్రిస్ట్ వద్దకు పంపిస్తున్నారు. అక్కడ కంప్యూటర్ యంత్రంపై మరో సారి పరీక్షలు చేసి, అద్దాలు అవసరమా..? శస్త్ర చికిత్సలు అవసరమా..? అనేది నిర్ధారిస్తున్నారు. దగ్గరి చూపు లోపం ఉంటే వెంటే అద్దాలు, మందులు ఇచ్చి పంపిస్తున్నారు. దూరం చూపు లోపం ఉన్నా, శస్త్ర చికిత్సలు అవసరమున్నా వారిని ఐదో టేబుల్ వద్ద ఉన్న డాటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో) వద్దకు పంపించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దూరం చూపు వారికి మాత్రం ఆర్డర్ పెట్టి తెప్పించి త్వరలోనే పంపిణీ చేస్తారు.
ఫ్రేమ్స్ అదుర్స్
శిబిరాల్లో రకరకాల మాడల్స్ అద్దాలను అందిస్తున్నారు. వృద్ధులు మొదలుకుని మహిళలు, యువత మొచ్చేలా ఫ్రేమ్‌లను డిజైన్ చేయించారు. ముఖ్యంగా ఒక్కో పాయింట్‌కు ఒక్కో మాడల్ ఇస్తున్నారు. ప్రస్తుతం దగ్గరి చూపు సమస్యలకు సంబంధించిన అద్దాలను అందుబాటులో ఉంచారు. రోగులకు పరీక్షలు చేసి అవసరాన్ని బట్టి +1, +1.5, +2, +2.5 పాయింట్ అద్దాలను అందిస్తున్నారు. పాయింట్ ఎక్కువ ఉన్న వారికి ప్రత్యేకంగా తయారుచేయించి త్వరలోనే ఇంటికే పంపించనున్నారు.
చూపునిచ్చిన దేవుడు కేసీఆర్
నేను బీడీలు చుడుతూ కుటుంబానికి ఆసరైతున్న. నాలుగైదేండ్ల కింద దగ్గరి చూపు సరిగ్గా లేకుండె. అప్పుడు కంటి వెలుగు శిబిరం చూపెట్టుకున్న. రూపాయి ఖర్చు లేకుండా పరీక్షలు చేసి, అద్దాలు ఇచ్చిన్రు. ఏడాది పాటు వాడిన. తర్వాత పాడైనయ్. అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో చూపెట్టుకుంటే వెయ్యికిపైగా వెట్టి కొత్త అద్దాలు తెచ్చుకున్న. అవి కూడా ఖరాబైతే మళ్ల పైసలు వెట్టి తెచ్చుకున్న. అవి కూడా దగ్గరవడ్డయ్. ఇంతల్నె కేసీఆర్ సారు కంటి వెలుగు మళ్లీ తెచ్చిండు. నేను శిబిరానికి పోయిన. మంచిగా పరీక్షలు చేసిన్రు. అద్దాలు, చుక్కల మందు ఫ్రీగా ఇచ్చిన్రు. అద్దాలు పెట్టుకుంటే మంచిగ కనబడుతుంది. నాలాంటోళ్లందరికి చూపునిచ్చిన దేవుడు మా కేసీఆర్. ఆ సారు సల్లంగుండాలె.
– రాపెల్లి రుక్కుంబాయి, బీడీ కార్మికురాలు, సుందరయ్యనగర్
(సిరిసిల్ల టౌన్)