కరీంనగర్ కమాన్‌చౌరస్తా/ సిరిసిల్లటౌన్/ పెద్దపల్లి కమాన్, సెప్టెంబర్ 11 : బీఆర్ఎస్వీ నాయకులు కన్నెర్రజేశారు. గ్రూప్-1 మెయిన్స్‌లో అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీకి కమిషన్ ఏజెంట్‌గా టీజీపీఎస్సీ మారిందని ఆరోపించారు. పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్, సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద, సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీచౌరస్తాలో ప్రభుత్వం, టీజీపీఎస్సీ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ధర్నా చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. కాగా, కరీంనగర్లో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, నాయకులు మాట్లాడుతూ ప్రజాపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, విద్యార్థులపై నిర్బంధకాండను కొనసాగిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జీవో నం. 29 రద్దు చేయాలని, జీవో 55 ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ -1 పరీక్షను రద్దు చేసి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని, హైకోర్టు చెప్పినట్టుగా అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ చేయాలన్నారు.
అందుకు బాధ్యత వహించి సీఎం రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్, కమిషన్ అధికారులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీని రద్దు చేసి కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, ఒక్కో ఉద్యోగానికి 3కోట్లు వసూలు చేసిన కాంగ్రెస్ నాయకులపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వంపై యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు. ఇక్కడ బీఆర్ఎస్వీ శాతవాహన యూనివర్సిటీ ఇన్చార్జి చుక శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, బీఆర్ఎస్ యూత్ కరీంనగర్ నియోజకవర్గ అధ్యక్షుడు గంగాధర చందు, నాయకులు బందారపు అజయ్ కుమార్ గౌడ్ , ఆరే రవి గౌడ్, నారదాసు వసంత రావు, పటేల్ శ్రవణ్ రెడ్డి, సోమిరెడ్డి నరేష్ రెడ్డి, ఒడ్నాల రాజు, అఫ్రోజ్, అవినాష్ , సోహెల్, సైఫ్, ప్రశాంత్, పదం సిద్దు, లింగాల సాయి కిరణ్, ఉప్పు మనోజ్, శ్యామ్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.