మెట్పల్ల్లి, మార్చి 27 : తమ నియోజకవర్గంలోని ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి చెరుకు రైతులను ఆదుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. గురువారం శాసనసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. మూతపడిన నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎన్నికల వేళ రైతులకు హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక కమిటీ వేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ చక్కెర ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ 2014-15లో రైతులతో సహకార సంఘం ఏర్పాటు చేసి చక్కెర ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలు రైతులకే ఇద్దామనే ఆలోచన చేశారని గుర్తు చేశారు.
2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చక్కెర ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై ఒక కమిటీ వేసిందని, ఆ కమిటీలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములును, ఇప్పుడు ఈ ప్రభుత్వం వేసిన కమిటీలో స్థానిక శాసనసభ్యుడినైన తనను చేర్చలేదన్నారు. చెరుకు రైతుల పక్షాన తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు నిరాహార దీక్ష కూడా చేశారని గుర్తు చేశారు. రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఆ కమిటీలో తనకు స్థానం కల్పించాలన్నారు. చెరుకు రైతుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే చక్కెర ఫ్యాక్టరీని తెరిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.