పెద్దపల్లి కమాన్, ఆగస్టు 5 : గోదావరిలో నీళ్లు వృథాగా పోతున్నా పంటలకు సాగునీరు ఇవ్వకుండా రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయిందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరాన్ని పక్కకు పెట్టి తెలంగాణకు ఎండబెడుతున్నదని మండిపడ్డారు. ఏమైనా కక్షలు ఉంటే రాజకీయంగా ఎదుర్కొవాలి కానీ, అమాయక రైతులకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు. మంగళవారం పెద్దపల్లి తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై లైవ్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, నాయకులు కౌశిక హరి, గంట రాములు, రఘువీర్‌సింగ్, ఉప్పు రాజ్‌కుమార్, గోపు అయిలయ్య యాదవ్‌తోపాటు కార్యకర్తలతో కలిసి ఆయన వీక్షించారు. ఓవైపు వర్షాలు పడక, ప్రాజెక్టు నీళ్లు విడుదల చేయక వేసిన పంటలు ఎండిపోయి ఎవుసం ప్రశ్నార్థకమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెంటనే నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ కుట్రలు తేలిపోయాయని, వచ్చే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పక్కకు పెట్టింది. కావాలనే బరాజ్‌లను ఎండబెడుతున్నది. కేసీఆర్‌పై కక్షతో చుక్క నీళ్లు ఆపకుండా గేట్లు తెరిచి కిందికి వదిలేస్తున్నది. కన్నెపల్లి పంపుహౌస్ సందర్శనకు వెళ్లినప్పుడు గోదావరి నుంచి నీళ్లు వృథాగా పోవడం చూసి భావోద్వేగానికి లోనయ్యాం. కండ్ల ముందే నీళ్లు వృథాగా పోతుంటే గుండె అవిసిపోయింది. ఎనకట చెరువు మత్తడి తెగితే ఇసుక బస్తాలు వేసి నీళ్లు ఆపుకునేటోళ్లం. కానీ, మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లను బూచీగా చూపి, మరమ్మతులు చేయకుండా చోద్యం చూడడం సరికాదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పెద్దపల్లి జిల్లా ప్రజలు అవగాహన పెంచుకొని ప్రభుత్వాన్ని నిలదీయాలి.