ఆయనో జగిత్యాల జిల్లాలోని ఓ ముఖ్య కార్యాలయంలో కీలక అధికారి.. ఉన్నతాధికారుల్లో ఆయనది ఒక స్థానం.. విచారణ అధికారిగా ముద్రపడిన ఆయన పేరు చెబితే జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు హడల్.. ఏ పత్రికలోనైనా తమకు వ్యతిరేకంగా వార్త వచ్చినా, తమ ప్రమేయం లేకుండా ఆరోపణలు వచ్చినా వణుకే.. ఎక్కడ తాము బుక్ అవుతామోననే ఆందోళన.. ఆయన విచారణ మొదలు పెట్టాడంటే, తప్పు ఉన్నా లేకున్నా చేతి చమురు వదలాల్సిందేన్న భయం.. సదరు అధికారి ఏనాడైతే జిల్లాకు బదిలీపై వచ్చాడో, ఆ రోజు నుంచి జిల్లా సర్వస్వం ఆయన చేతిలోకి వెళ్లిపోయిందని, ఏ విచారణ అయినా ఆయన వద్దకే వెళ్తుందని, వివరాలు మాత్రం బయటకు రావని గుసగుసలు గుప్పుమంటున్నాయి. సార్ తలుచుకుంటే నిబంధనలు గిబంధనలు అన్నీ తూచేనని, ఆయన ఏదనుకుంటే అదే జరుగుతుందన్న మాటలు వినిపిస్తున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ తలలో నాలుకలాగా, ఆదాయం ఇచ్చే అల్లావుద్దీన్ దీపంలా పనిచేశాడని, అందుకే ఆయన ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్నట్టుగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జగిత్యాల, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లాలోని కీలక కార్యాలయంలో కీలక అధికారి ఆయన! ఎక్కడ ఎలాంటి ఆరోపణలు వినిపించినా, పత్రికల్లో ప్రతికూలమైన వార్తలు ప్రచురితమైనా విచారణ చేసే బాధ్యత సదరు కీలక అధికారి వద్దకు చేరుతున్నట్టు తెలుస్తున్నది. జిల్లాలోని కీలక కార్యాలయంతోపాటు డివిజన్, మండల స్థాయిల్లోని ప్రభుత్వ ఆఫీసుల్లోనే దీనిపైనే చర్చ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. సదరు అధికారి వచ్చిన కొత్తలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పుడు ప్రస్తుత బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి సైతం సదరు భూమి అన్యాక్రాంతంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ బాధ్యతను కీలక అధికారికి అప్పగించారు.
ఆగమేఘాలపై అధికారులు విచారణ చేపట్టారు. కానీ, ఏడు నెలలు గడుస్తున్నా ఆ విచారణ సమాచారం మాత్రం బయటకు రాలేదు. వివాదాస్పదమైన భూమి నక్షా, కొలతల వివరాలు అతీగతి లేకుండా పోయాయి. ఏ అధికారి వద్దకు వెళ్లి సదరు భూమి గురించి అడిగినా, తమకు ఏం తెలియదనే చెబుతున్నారే తప్పా వివరాలు మాత్రం చెప్పడం రావడం లేదు. సమాచార హక్కు చట్టం కింద విచారణ, భూమి కొలతల వివరాలు అడిగినా స్పందన లేదు. ఇక ఒక శాఖలో ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలోనూ అనేక ఆరోపణలు వినిపించాయి. పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. దీనిపై సైతం సదరు కీలక అధికారికే విచారణ బాధ్యతలు అప్పగించగా, ఆరు నెలలైనా ఆ రిపోర్ట్ బయటకు రాలేదు.
ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఒక మండలంలో రెవెన్యూ అధికారి నేరుగా తన కార్యాలయంలోనే తాగుతూ పనిచేస్తున్నాడని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపైనా విచారణ చేసే బాధ్యత కూడా సదరు కీలక అధికారి చేతికే వెళ్లింది. ఇంకేముంది! ఎప్పటిలాగే విచారణ జరిగినా వివరాలు బయటికి వెల్లడి కాలేదు. అలాగే జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లోనూ అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిపైనా విచారణ జరిగినా సేకరించిన వివరాలు, సమర్పించిన రిపోర్ట్ అన్ని గాయబ్! మున్సిపాలిటీల పరిధిలో తప్పులు జరిగాయా.. లేదా..? అన్నది మాత్రం బ్రహ్మపదార్థంగా మారిపోయింది. ఇవి మచ్చుకు మాత్రమే! ఇంకా ఇలాంటి ఎన్నో విచారణలు ఆయన పరిధిలో మూలుగుతున్నట్టు తెలుస్తున్నది.
విచారణ మొదలైంది అంటే.. తమ చేతి చమురు వదలాల్సిందేనని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. తప్పు పనిచేసి కొందరు అధికారులు, ఉద్యోగులు, ఉత్తి గాలి వార్తలతో మరికొందరు విచారణ ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. అయితే సదరు కీలక అధికారి విచారణ అంటూ చేపట్టాడంటే, తప్పు చేసిన వారికైనా, చేయని వారికైనా చేతి చము రు వదలాల్సిందేని చెబుతున్నారు. ఓ భూకబ్జా కేసులో కోట్ల రూపాయు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించిన నేపథ్యంలో వివాదాస్పదమైన భూమి కొలతలు సైతం అందుబాటులో లేకుండా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మిగిలిన వాటిలోనూ ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు.. పెద్ద ఎత్తునే ముట్టజెప్పి తప్పిదాల నుంచి తప్పించుకున్నారని చెబుతున్నారు. సార్ జిల్లాకు వచ్చిన తొమ్మిది పది నెలల కాలంలోనే కోట్లలోనే కూడబెట్టారన్న ప్రచారం జరుగుతున్నది.
జిల్లాలో విచారణాధికారిగా ముద్రపడిన సదరు కీలక అధికారి, రెండు దశాబ్దాలుగా వివిధ జిల్లాలో పనిచేసి అనుభవం గడించాడు. గ్రూప్ 2 నుంచి వచ్చిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలోను, తెలంగాణ రాష్ట్రంలోను కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. దీంతో సదరు అధికారికి ప్రభుత్వాల్లో, ప్రజాప్రతినిధుల్లో విపరీతమైన పలుకుబడి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో డివిజన్ స్థాయి అధికారిగా పనిచేస్తున్న సమయంలో ఆయనను తమ డివిజన్‌కు అధికారిగా నియమించాలంటూ ఒకేసారి ఐదారుగురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేయడం గతంలో సంచలనం సృష్టించింది.
సదరు అధికారిపై ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు చూపుతున్న ఇంట్రెస్ట్ చూసి అనుమానం కలిగిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు.. నాడు సిఫారసులను పక్కన పెట్టి, ప్రాధాన్యత లేని చోట పోస్టింగ్ చేయడం సైతం చర్చనీయాంశమైంది. సార్ ఎక్కడ పనిచేసినా నిబంధనలను తనకు అనుకూలంగా మలుచుకుంటాడని, తనకు నచ్చిన విధంగానే పనిచేస్తాడన్న విమర్శలున్నాయి.
ఇటీవల ఒక కమిటీ నియామకంలోనూ ఉన్నతాధికారి సభ్యుల నియామక అంశాన్ని సదరు కీలక అధికారికి అప్పగించినట్టు తెలుస్తున్నది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఆ అధికారి తనకు పైరవీల్లో సహకరించే ఓ వ్యక్తిని కమిటీలో ఫిక్స్ చేసినట్టు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ, సర్కారు జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ పక్కన పెట్టి, సదరు అధికారి తనకు నచ్చిన వ్యక్తులకు కమిటీలో సభ్యత్వం కల్పించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విచారణాధికారిగా పేరొందిన కీలకాధికారికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఉమ్మడి జిల్లా పరిధిలోని ఒక మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తున్నది. రెండు దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లాలో పనిచేయడం, ప్రజాప్రతినిధులందరితోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతోపాటు వారికి ఏ అవసరం వచ్చినా చేసేందుకు సదరు అధికారి ముందు వరుసలో ఉంటారన్న ప్రచారం ఉన్నది. లీగల్, ఇల్లీగల్ ఏ టైప్ పనినైనా సునాయసంగా చేసిపెడుతాడన్న నమ్మకం ప్రజాప్రతినిధుల్లో ఉన్నది. ఇక ప్రజాప్రతినిధులతోపాటు ప్రధాన అధికారులకు సైతం సదరు జిల్లా స్థాయి కీలక అధికారి తమను అన్ని విధాలుగా, ముఖ్యంగా ఆర్థిక పరంగా సంతృప్తి పరుస్తాడన్న నమ్మకంతో వంతపాడుతున్నట్టు తెలిసింది.
ఇక ఉమ్మడి జిల్లాలోని ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉండడంతో సదరు కీలక అధికారి ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్నట్టు సాగుతున్నదనే ప్రచారం నడుస్తున్నది. జిల్లాకు వచ్చిన తర్వాత కీలక శాఖ మరో అధికారి పరిధిలో ఉండడం, ఆశించిన స్థాయిలో ఆమ్దానీ వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో మరో జిల్లాకు వెళ్లేందుకు సదరు అధికారి సిద్ధిపడినా, జిల్లాకు చెందని ప్రజాప్రతినిధులు.. కొద్ది నెలలు గడిస్తే సీనియర్ రిటైర్ అవుతారని, అప్పుడు జిల్లాను ఏకచత్రాధిపత్యంగా ఏలవచ్చునని చెప్పడంతో ఇక్కడే ఉన్నట్టు తెలుస్తున్నది. ఏదేమైనా సదరు కీలక అధికారి వ్యవహారశైలి అధికారులు, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.