జగిత్యాల రూరల్, మే 1 : పల్లెల అభివృద్ధిపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాడు కేసీఆర్ పాలనలో పల్లెలకు నిధులు ఇచ్చి జాతీయ స్థాయిలో తీర్చిద్దారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. రెండున్నరేళ్లుగా కేంద్రం నుంచి వస్తున్న నిధులే తప్పా రాష్ట్రం నుంచి నిధులు రావడం లేదని మండిపడ్డారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ‘రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోవాలి.. కేసీఆర్ ప్రభుత్వం రావాలి’ అని పల్లె ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఎక్కడ చూసినా ఇదే నినాదం హోరెత్తుతున్నదన్నారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్లో శుక్రవారం నిర్వహించిన మేడే వేడుకల్లో జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ దూరదృష్టితో పల్లెలను ఆదర్శంగా నిలిపారని, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా నిధులు సమకూర్చారని గుర్తు చేశారు.
వైకుంఠధామాలు, డంప్ యార్డులు నిర్మించారని, చెత్త సేకరణ ట్రాక్టర్లు ఇచ్చారని, హరితహారంలో భాగంగా మొక్కలు నాటారని, క్రీడామైదానాలను ఏర్పాటు చేశారని చెప్పారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన పాలన అందిస్తుందనుకుంటే అన్ని వర్గాలనూ గోస పెడుతున్నదని మండిపడ్డారు. ఈ పాలనను ఇంకెంత కాలం భరించాలని నిలదీశారు. గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం ద్వారా వస్తున్న నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని మండిపడ్డారు. జీపీ కార్మికులకు వేతనాలను గ్రామ పంచాయతీల నుంచి చెల్లించడం ద్వారా భారం పడుతుందన్నారు. పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు వేతనాలను ప్రభుత్వం ద్వారా చెల్లిస్తే స్థానిక సంస్థలపై భారం పడకుండా అభివృద్ధి చెందుతాయని సూచించారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులలాగా జీపీ కార్మికులకు కూడా ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే నిధులు వస్తాయని సర్పంచులకు చెబుతున్నారని, అసలు పనిచేస్తే నిధులు వస్తాయా..? లేకుంటే రావా..? అని ప్రశ్నించారు. గ్రామాల్లో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే బాధ్యత పంచాయతీ పాలక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాహుల్‌గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్‌లో పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారని, రైతుబంధు సంవత్సరానికి రూ.15వేలు ఇస్తామని చెప్పినా.. ఈ ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని బీఆర్ఎస్ ఈనెల 6న వరంగల్‌లో రైతుసభ చేపడుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, రైతుల వడ్లు, మక్క పంటలు త్వరితగతిన కొనాలని డిమాండ్ చేశారు. అనంతరం జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. పంచాయతీ కా ర్మికుల సమస్యలు పరిష్కరంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇంత వరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో గ్రామ స్వ రాజ్యం అంటే ఏంటో చూపించారని, కానీ, కాంగ్రె స్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను విస్మరిస్తున్నదని, నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్మికులను జీవన్‌రెడ్డి, వసంత సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచులు జున్ను రాజేందర్, శీలం సురేందర్, చెవుల గంగ న్న, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మా ర్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మెన్ ఆసిఫ్, నాయకులు ఎల్లా రాజన్న, మల్లారెడ్డి, స్వామిరెడ్డి, బాలే రవి, సత్తయ్య, ముత్యం, బాలే చందు, సోహెల్, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.