హైదరాబాద్ , ఆగస్టు 12 (నమస్తేతెలంగాణ): ‘ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి మరోపార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తే, అది ఆ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టుగానే పరిగణించాలి. పార్టీ మారి మరో పార్టీ తరఫున పోటీ చేయడాన్ని రాజ్యాంగం నేరుగా నిషేధించకపోయినా, పదో షెడ్యూల్ కింద అనర్హత వర్తించే అవకాశం ఉన్నది. పార్టీ ఫిరాయించిన పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతకు వార్తాకథనాలను మాత్రమే కాకుండా ఎన్నికల గెజిట్లు, అధికారిక పత్రాలు, నామినేషన్ సమయంలో సమర్పించిన ఫారం-26 అఫిడవిట్లనూ ఆధారాలుగా పరిగణించాలి’ అని న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. అనర్హత పిటిషన్లపై విచారించి నిర్ణయం వెలువరించే విషయంలో శాసనసభ స్పీకర్ అధికారానికీ పరిమితులున్నాయని బీఆర్ఎస్, బీజేపీ తరఫు సీనియర్ న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచాక కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టీ ప్రకాశ్‌గౌడ్ , అరికెపూడి గాంధీ, తెల్లం వెంకటరావు, సంజయ్‌కుమార్ దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ వెలువరించిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, కే సంజయ్, పల్లె రాజేశ్వర్‌రెడ్డి, సీహెచ్ ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన 9 పిటిషన్లపై బుధవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ , జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం సమగ్రంగా విచారించింది. బీఆర్ఎస్ పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది కే వివేక్‌రెడ్డి వాదనలు వినిపించారు. స్పీకర్ అనర్హత పిటిషన్లను కొట్టివేయడానికి పరిగణనలోకి తీసుకున్న ఆధారాలను పిటిషనర్లకు అందజేయలేదని వాదించారు. స్పీకర్ రికార్డుల్లో లేని అంశాలను ఆధారంగా తీసుకుని నిర్ణయానికి వచ్చారని, సంబంధంలేని అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని పేర్కొన్నారు.
విచారణలో సహజ న్యాయసూత్రాలను స్పీకర్ పాటించలేదని న్యాయవాదులు ఆరోపించారు.పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్ చైర్మన్‌గా వ్యవహరించేటప్పుడు స్పీకర్‌కు అపరిమిత స్వేచ్ఛాధికారంలేదని, వాస్తవాలను నిర్ధారించాల్సిన బాధ్యత మాత్రమే ఉందని సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ వారు వాదించారు. వాస్తవాలు నిర్ధారణ అయిన తర్వాత అనర్హత నిబంధనలు సహజంగానే వర్తిస్తాయని పేర్కొన్నారు. స్పీకర్ అధికార పరిధిని శాసనసభలో జరిగే కార్యకలాపాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అంశాలకే పరిమితం చేయడం సరికాదని వా దించారు. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై అనంతరం కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడం పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టేనని, అలాంటి చర్య జరిగినప్పటికీ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్టుగా భావించలేమన్న స్పీకర్ నిర్ణయం సరికాదని వాదించారు. పదో షెడ్యూల్ లోని 2(1)(ఏ) ప్రకారం సభ్యుడు తన రాజకీయ పార్టీ స్వభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారా, లేదా అన్నదే ప్రధానంగా పరిశీలించాల్సిన అంశమని.. ప్రభుత్వం స్థిరంగా ఉన్నదా, అసెంబ్లీలో పార్టీ బలం తగ్గిందా, ప్రభుత్వ మ నుగడపై ప్రభావం పడిందా వంటి అంశాలు అనర్హతకు ప్రమాణాలు కావని స్పష్టంచేశారు. స్పీకర్ ఉత్తర్వుల్లో పదో షెడ్యూల్‌ను తప్పుగా అన్వయించారని, సభ వెలుపల సభ్యుడి రాజకీయ కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకోలేమన్నట్టుగా వ్యవహరించడం సరికాదని గండ్ర మోహన్‌రావు వాదించారు.
అది సభలోని ప్రవర్తనకే పరిమితం కాదు
పదో షెడ్యూల్ లోని 2(1)(ఎ)లో సభ్యు డు పార్టీని కేవలం శాసనసభలోనే వీడాలన్న పరిమితి లేదని గండ్ర మోహన్‌రావు తెలిపా రు. అదే షెడ్యూల్లోని 2(1)(బి) పార్టీ విప్‌నకు వ్యతిరేకంగా ఓటు వేయడం లేదా ఓటింగ్‌కు గైర్హాజరు కావడం వంటి సభలోని ప్రవర్తనకు సంబంధించినదని వివరించారు. 2(1) (బి) సభలోని చర్యలకు పరిమితమైనప్పటికీ, 2(1)(ఎ) పరిధిని కూడా సభలో జరిగిన చర్యలకే కుదించడం సరికాదన్నారు. ఒక పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికై.. మరోపార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడాన్ని రా జ్యాంగం నేరుగా నిషేధించక పోయినా, ఆ చ ర్య పదో షెడ్యూల్ కింద అనర్హతకు దారితీసే అవకాశం ఉన్నదని తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ఉద్దేశం కేవలం ప్రభుత్వ అ సెంబ్లీ బలాన్ని కాపాడటం కాదని, ఒక పార్టీ తరఫున ప్రజల తీర్పుతో ఎన్నికైన వ్యక్తి అనంతరం మరో పార్టీకి అనుకూలంగా వ్యవహరించే పరిస్థితిని నిరోధించడమని వాదించారు.
కాంగ్రెస్ టికెట్‌పై పోటీ కీలకం
బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేయడం కీలకాంశమని సీనియర్ న్యాయవాది వివేక్‌రెడ్డి వాదించారు. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టు చూపించే గెజిట్, కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినట్టు చూపించే ఎన్నికల గెజిట్, నామినేషన్ సందర్భంగా సమర్పించిన ఫారం-26 అఫిడవిట్లను ఆధారాలుగా సమర్పించినట్టు కోర్టుకు తెలిపారు. ఒకపార్టీ తరఫున శాసనసభకు ఎన్నికై, అదే పార్టీకి వ్యతిరేకంగా మరోపార్టీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ప్రచారం చేసిన వ్యక్తి తాను అసలు పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోలేదని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. ఆయనపై అనర్హత వేటు వేయకుండా స్పీకర్ తీర్పు చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
అధికారిక పత్రాలే ప్రధాన ఆధారాలు
అనర్హత పిటిషన్లను కొట్టివేయడానికి స్పీకర్ ఆధారాలుగా పరిగణించిన వాటిని పిటిషనర్లకు పూర్తిగా అందించలేదని న్యాయవాదులు అభ్యంతరం చెప్పారు. కేవలం వార్తా కథనాలపైనే ఆధారపడలేదని, ఎన్నికల గెజిట్లు, అధికారిక పత్రాలు, నామినేషన్ సమయంలో సమర్పించిన ఫారం-26 అఫిడవిట్లను ఆ ధారాలుగా సమర్పించామని తెలిపారు. అయి నా వార్తాకథనాల మూలాలు, రిపోర్టర్లు, ఎడిటర్ల వివరాలు ఇవ్వలేదంటూ స్పీకర్ ఉత్తర్వు లో ప్రస్తావించడం సరికాదన్నారు. అధికారిక ఎన్నికల పత్రాలు, గెజిట్లు, అఫిడవిట్ లలో ని అంశాలను సంబంధిత వ్యక్తులు తిరసరించనప్పుడు.. వాటిని మళ్లీ ప్రత్యేకంగా సాక్ష్యాలతో నిరూపించాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన సోషల్ మీడియా ఖాతాల్లోని పోస్టులను కూడా స్పీకర్ ఎదుట ఆధారాలుగా చూ పించినట్టు, వీడియో ఫుటేజీలను ప్రదర్శించిన ట్టు తెలిపారు. అయితే ప్రస్తుత పిటిషన్‌కు కా కుండా అదే బ్యాచ్‌లోని మరో మూడు పిటిషన్లకు సంబంధించిన వీడియో ఆధారాలు కూ డా ఉన్నాయని తెలిపారు. ఆ పిటిషన్లు కోర్టు ముందుకు వచ్చినప్పుడు వీడియోలను పరిశీలించవచ్చని పేర్కొన్నారు.
పరిధి లేదంటే గవర్నర్‌కు పంపలేదెందుకు?
సభ వెలుపల జరిగే రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిన అనర్హతపై స్పీకర్‌కు పరిధి లేదని భావిస్తే, ఆ అంశాన్ని గవర్నర్ పరిధిలోకి ఎందుకు పంపలేదని న్యాయవాదులు ప్రశ్నించారు. సభ వెలుపల జరిగే రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిన అనర్హత ఉంటే గవర్నర్‌ను ఆశ్రయించాలని స్పీకర్ తన ఉత్తర్వు లో చెప్పడం సరికాదన్నారు. స్పీకర్‌కు పరిధి లేదని భావించినట్లయితే ఆ అంశాన్ని గవర్నర్‌కు ఎందుకు సిఫారసు చేయలేదని వారు ప్రశ్నించారు. అయితే ప్రస్తుత వ్యవహారం పదో షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపులకు సంబంధించినదే కాబట్టి, దానిపై నిర్ణయం తీసుకునే రాజ్యాంగపరమైన అధికారం స్పీకర్‌కే ఉందని స్పష్టంచేశారు. పదో షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అనర్హత ప్రత్యేక రాజ్యాంగ వ్యవస్థలోకి వస్తుందని, దానిపై నిర్ణయం స్పీకర్ పరిధిలోనే ఉం టుందని 2019లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా న్యాయవాదులు ప్రస్తావించారు. స్పీకర్ ఉత్తర్వులను రద్దు చేసి, పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని న్యాయపరమైన నిర్ణయం తీసుకోవాలని న్యాయవాది గండ్ర మోహన్‌రావు హైకోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
స్పీకర్ కార్యాలయ జాప్యంపైనా అభ్యంతరం
స్పీకర్ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, రికార్డుల్లో లేని అంశాల ఆధారంగా నిర్ధారణలకు రావ డం, సంబంధంలేనివి పరిగణనలోకి తీ సుకొని న్యాయసూత్రాలను ఉల్లంఘించారని వాదించారు. అనర్హత పిటిషన్‌ను 2024 జూన్ 18న దాఖలు చేసినప్పటికీ స్పీకర్ కార్యాలయం వెంటనే చర్యలు తీసుకోలేదని న్యాయవాదులు తెలిపారు. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో సంబంధిత వ్యక్తి పేరున్న విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లేందుకు అదనపు అ ఫిడవిట్ దాఖలు చేయడానికి ప్రయత్నించినా తొలుత స్వీకరించలేదన్నారు. రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపిన పత్రాన్నీ స్వీకరించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామని, కోర్టు ఆదేశాల తర్వాతే అదనపు అఫిడవిట్‌ను స్వీకరించారని తెలిపారు.
కోర్టు తీర్పులనూ ఖాతరు చేయని స్పీకర్
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు తీర్పుతోపాటు సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలను కూడా స్పీకర్ ఖాతరు చేయలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తీవ్రంగా వాదించారు. కోర్టు తీర్పులు, చట్టాలు, రాజ్యాంగ అధికరణాలను ఉల్లంఘిస్తూ స్పీకర్ వ్యవహరించారని ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరినట్లు స్పష్టమైన ఆధారాలు చూపించినప్పటికీ వాటిని పట్టించుకోలేదన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా స్పీకర్ ఖాతరు చేయలేదన్నారు.
స్పీకర్ స్వేచ్ఛాధికారం అపరిమితం కాదు
సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను న్యాయవాదులు ప్రస్తావించారు. పదో షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని, ఆ హోదాలో ఆయనకు అపరిమిత స్వేచ్ఛాధికారం ఉండదని తెలిపారు. తన ముందున్న వాస్తవాలు, ఆధారాలను నిర్ధారించాల్సి ఉంటుందని, అనర్హతకు అవసరమైన వాస్తవాలు నిర్ధారణ అయితే దాని ఫలితం నిబంధనల ప్రకారం వర్తిస్తుందని పేరొన్నారు.
స్పీకర్ రాజకీయ వ్యక్తి అయినప్పటికీ ట్రిబ్యునల్ చైర్మన్‌గా వ్యవహరించే సమయంలో రాజకీయాలకు అతీతంగా, నిష్పాక్షికంగా, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గండ్ర మోహన్‌రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన విచారణ ప్రమాణాలను స్పీకర్ పకన పెట్టారని వాదించారు. సభ వెలుపల సభ్యుడు నిర్వహించే రాజకీయ కార్యకలాపాలనూ పదో షెడ్యూల్ కింద పరిశీలించలేమన్నట్టుగా స్పీకర్ తన ఉత్తర్వులో పేరొనడం సరికాదని ఆయన వాదించారు. సభ్యుడు తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నాడా, లేదా అన్నది నిర్ధారించడానికి సభ వెలుపల జరిగిన రాజకీయ పరిణామాలు కూడా సంబంధిత ఆధారాలుగా ఉండవచ్చన్నారు. 2(1)(ఎ)లో సభలోనే పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవాలన్న షరతు లేదని పునరుద్ఘాటించారు.