జగిత్యాల, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న దోపిడీ, అన్యాయం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు కనిపించడం లేదా..? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన మంత్రి కాగానే అన్ని సమస్యలు కనుమరుగయ్యాయని అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.2వేల కోట్లకుపైగా స్కాం జరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వం కన్నా మెరుగైన పాలన ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను నిండా ముంచారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు.
ధర్మపురిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సమావేశంలో రైతులు ఏవిధంగా దగా పడ్డారో.. ఇసుక అక్రమ రవాణా ఎలా జరుగుతున్నదో.. అన్న విషయాలపై చర్చించామని చెప్పారు. దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందిస్తూ, జీవన్ రెడ్డి కండువా మార్చగానే కాంగ్రెస్‌లో అవినీతి కనపడుతుందా..? అని మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రజాపక్షంగా ఉండే తాను ఏనాడైనా వాస్తవాలే మాట్లాడానని, మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే లక్ష్మణ్ వాస్తవాలు విస్మరిస్తున్నారని విమర్శించారు. ధర్మపురి గోదావరి పరీవాహక ప్రాంతంలో 3 వేల ఇసుక డంప్‌లను తహసీల్దార్ సీజ్ చేశారని, అయితే సీజ్ అయిన రూ.30 లక్షల విలువైన ఇసుక ఏమైందని, ఆ డబ్బులు ఎవరికి జేబులోకి పోయాయని ప్రశ్నించారు. రైతులు ధాన్యం కొనుగోళ్లలో నిలువు దోపిడీకి గురయ్యారని ఆవేదన చెందారు.
తాను పండించిన మొత్తం ధాన్యం 544 బ్యాగులను 218 క్వింటాళ్లుగా తూకం వేసిన అధికారులు, ట్రక్ షీట్‌పై 190 క్వింటాళ్లు అనే పేర్కొన్నారన్నారు. ఈ లెక్కన తన ధాన్యానికే క్వింటాల్‌కు ఐదు కిలోల చొప్పున మొత్తం 28 క్వింటాల ధాన్యం కోత విధించారని ఆగ్రహించారు. మరో రైతుకు ధర్మకాంటా ప్రకారం 271 క్వింటాళ్ల రావాల్సి ఉన్నా ట్రక్ షీట్ 250 క్వింటాళ్లకు ఇచ్చారన్నారు. ధర్మకాంటాకు, ట్రక్ షీట్‌కు మధ్య ఎందుకు వ్యత్యాసం వస్తుందో మంత్రి సమాధానం చెప్పాలన్నారు. రైతులు శ్రమించి పండించిన పంట దోపిడీకి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. రైతులు క్వింటాల్‌కు పది కిలోల చొప్పున రూ.250 నష్టపోతున్నారని ఆవేదన చెందారు. జగిత్యాల జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగినట్టు అధికారులు లెక్కలు చెబుతున్నారని, ఈ లెక్కన ఒక్క జగిత్యాల జిల్లాలోనే రూ.125 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు.
ఈ దోపిడీ మిల్లర్లకే పరిమితమైందా? లేదా అధికారులు, ప్రజాప్రతినిధులకు వాటా ఉన్నదా? నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొనుగోళ్లలో కోతలపై ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి అంటున్నారని, అయితే ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. మరో రెండేళ్లు మంత్రిగా ఉండాలనే తాము కోరుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అయిల్నేని వెంకటేశ్వర్ రావు, కౌన్సిలర్ దేవేందర్ నాయక్, శివకేసరి బాబు, మున్న బాయ్, మహిపాల్ రెడ్డి, కల్లేపల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్, రాధా కిషన్ రావు, నేహల్, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, సర్పంచ్ శీలం సురేందర్, పల్లె లక్ష్మీ రవి, పొనిశెట్టి మహేశ్, సుమన్ రావు, అల్లాల ఆనంద్ రావు, గుండా మధు, హరి తదితరులు పాల్గొన్నారు.