హైదరాబాద్, ఆగస్టు12 (నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు పథకాలను నిలిపివేయాలనే కుట్రతోనే కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని, కౌంటర్ దాఖలు చేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీల ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సాయం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. ఆడబిడ్డల కల్యాణానికి ప్రభుత్వం లక్ష నూటపదహార్ల నగదు అందజేస్తున్నది. పథకం ద్వారా కేసీఆర్ హయాంలోనే 13లక్షల మంది ఆడబిడ్డలు లబ్ధి పొందారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించడమేకాకుండా.. అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. మ్యానిఫెస్టోలోనూ పొందుపర్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని అటకెక్కించి, అంతకుముందున్నట్టుగానే నగదు అందజేతకే పథకాన్ని పరిమితం చేసింది.
మొక్కుబడిగా అమలు
గతంలో దరఖాస్తుల ప్రక్రియను వడివడిగా పూర్తిచేయగా, ప్రస్తుతం నత్తనడకన కొనసాగుతున్నదని చెప్తున్నారు. కేసీఆర్ హయాంలో పెండ్లిమండపంలోనే కల్యాణలక్ష్మి చెక్కులు అందజేయగా.. కాంగ్రెస్ పాలనలో బిడ్డలను చంకనెత్తుకుని వచ్చి, చెక్కులు అందుకుంటున్న ఉదంతాలూ తరచూ చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం దాదాపు 1.50 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, దీనిని బట్టే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు.