హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభు త్వం పోతిరెడ్డిపాడు నుంచి నిత్యం 30వేల క్యూసెక్కుల నీటి ని తరలిస్తుంటే కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నదని మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, నల్లమోతు భాస్కర్‌రావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, నేతలు నర్సింహారెడ్డి, కడారి అంజయ్యతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నీటి హక్కులను రేవంత్ సర్కార్ ఏపీకి తాకట్టుపెట్టిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర రైతాంగానికి నీరందించకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీరని ద్రోహం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఎగువ నుంచి కృష్ణాకు బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నా ఎత్తిపోయకుండా సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో శ్రీశైలం ఎగువన 10 నుంచి 12 లక్షల ఎకరాలకు 17 పంటలకు నీరందించామని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత వైఖరితో చుక్కనీరు వచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. నాగార్జునసాగర్‌లో నీళ్లున్నా రైతులకు ఇవ్వమని నల్లగొండకు చెందిన మంత్రి చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. సాగర్ నిండిన తర్వాతే పోతిరెడ్డిపాడుకు నీళ్లు వదలాలని, అప్పటివరకు గేట్లను బంద్ చేయించాలని డిమాండ్ చేశారు.
పొలాలను ఎండబెట్టే కుట్ర..
ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ ప్రకృతి కరుణించడంతో శ్రీశైలం, జూరాల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి నీటితో కళకళలాడుతున్నాయని జగదీశ్‌రెడ్డి చెప్పారు. కానీ ప్రభుత్వ నిర్వాకంతో పాలమూరు జిల్లా రైతులకు మొదటి పంట పం డించుకొనే అవకాశం లేకుండా పోయిందని విమర్శించారు. ఆరుతడి పంటలు వేయాలంటున్న ప్రభుత్వం కనీసం నీరందించాలని డిమాండ్ చేశారు. వర్షాలు కురిసినా నీళ్లు ఎత్తిపోయడం చేతగాని ప్రభుత్వ పెద్దలు వరుణయాగం పేరిట ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని దుమ్మెత్తిపోశారు.
బీఆర్ఎస్ ఒత్తిడితోనే ఈఎన్సీ లేఖ..
తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులపై జీఆర్ఎంబీ రివ్యూ చేయాలని నిర్ణయించడం శోచనీయమని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. టీఏసీ అనుమతించిన తర్వాత పునఃసమీక్షించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మొదట మొద్దునిద్ర నటించిన ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ఒత్తిడితోనే కండ్లు తెరిచిందని ఎద్దేవా చేశారు. ఆలస్యంగానైనా ఈఎన్సీ లేఖ రాశారని స్పష్టంచేశారు. జీఆర్ఎంబీ ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులు లేవని బుకాయిస్తూ వచ్చిన మంత్రులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 18న నిర్వహించనున్న జీఆర్ఎంబీ సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మీటింగ్‌కు హాజరై అభ్యంతరాలు చెప్తామని మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ సైనికులు చూస్తూ ఊరుకోబోరని తేల్చిచెప్పారు. అవసరమైతే కేసీఆర్ ఆదేశాలు తీసుకొని ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.