జగిత్యాల, జూలై 2 (నమస్తే తెలంగాణ)/ సారంగాపూర్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆరే రాష్ర్టానికి భవిష్యత్ అని, ఆయన మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే డిజిటల్ సభ్యత్వ నమోదు చేపడుతామని, గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం పాత కొత్త అనే తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా సాగాలన్నారు. అలాగే సర్‌పై అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ మ్యాపింగ్‌పై గ్రామాల్లో బూత్ లెవల్ ఏజెంట్లు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ పేర్లు నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు. సారంగాపూర్, బీర్పూర్ మండల కేంద్రాల్లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్ఐఆర్)తోపాటు పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల జీవన్ రెడ్డి మాట్లాడారు. ‘సర్’ ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి స్థాయిలో ఓటర్ సవరణ సాధ్యం కాదని, గ్రామాల్లో ఇప్పటికీ 25 శాతం కూడా సవరణ ఫారాలు ఓటర్లకు అందలేదని, ఈనెల 24 వరకు ఫారాలను చేర్చే ప్రక్రియ పూర్తి కాదన్నారు. తెలంగాణలో సాధారణ ఎన్నికలకు రెండున్నరేండ్ల గడువు ఉన్న నేపథ్యంలో సర్ ప్రక్రియ గడువును మరో నెలలు పొడిగించాలని భారత ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు.
కానీ ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగడం లేదని వాపోయారు. రైతులకు ఎన్నో హామీలు గుప్పించిన రేవంత్‌రెడ్డి, అధికారంలోకి వచ్చాక రైతులకు మొండిచెయ్యి చూపారని, ఈ 30 నెలల్లో రూ.30వేల కోట్లు ఎగ్గొట్టారని విమర్శించారు. రైతును కోల్పోయిన కుటుంబాలకు ఆసరాగా ఉండే రైతు బీమా పథకానికి మంగళం పాడారని, ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో రైతుల కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వచ్చిందని వాపోయారు. రాష్ట్రంలో 7,600 మంది రైతులు చనిపోయారని, ఇప్పటికి వారికి రైతు బీమా చెల్లించకుండా ఈ ప్రభుత్వం ఎగ్గొట్టిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు కుంగితే ఇప్పటికి వాటికి మరమ్మతులు చేయని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్‌రెడ్డిదని విమర్శించారు.
రైతులకు రాయితీపై అందించాల్సి విత్తనాలను అందించడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని, ఎరువులు సకాలంలో అందించడంలో రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నారు. రోళ్లవాగు ప్రాజెక్ట్ గేట్లు బిగించడంలో ఆలస్యం చేస్తున్నారని, దీని వల్ల సమయానికి సాగునీరందక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోర్త్ సిటీ అని ప్రచారం చేస్తున్నారని, అది రేవంత్ రెడ్డి ధనదాహానికి పనికి వస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు కేసీ రెడ్డి, కొండ్ర రాంచంద్రరెడ్డి, తేలు రాజు, చెరుపూరి సుభాష్, నేరెల్ల సుమన్ గౌడ్, కొల్ముల రమణ, బల్మురి లక్ష్మణ్ రావు, ఆకుల రమేశ్, ఆకుల రాజిరెడ్డి, ఎండబెట్ల ప్రసాద్, బైరి మల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసే వరకు అందరం కలిసి కట్టుగా పనిచేయాలి. జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లోకి రావడం మరింత ధైర్యం ఇచ్చింది. జగిత్యాల ఎమ్మెల్యే గ్రామాల్లో ప్రజాప్రతినిధులను మభ్యపెడుతున్నడు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నడు. పెంబట్లలో రోడ్డు విషయంలో ప్రశ్నించిన రైతు వెంకటేశ్‌పై కేసులు నమోదు చేయించిన్రు. కేసులకు ఎవరూ భయపడవద్దు. బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుంది. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను ఎందుకు చేయడం లేదో ఎమ్మెల్యే చెప్పాలి. రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిండు. ఆయన అసభ్యకరమైన భాషతో బూతుల సీఎంగా మారిండు. మూసి నీటితో ఆయన నోరును ప్రక్షాళన చేసుకోవాలి.
– దావ వసంత, జడ్పీ మాజీ చైర్పర్సన్