MLA Sanjay Kalvakuntla | కోరుట్ల, జూన్ 18: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ అధోగతి పాలైందని, సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రానికి పెట్టుబడులు నిలిచిపోయాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ, పరిసర గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనతో రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిన తెలంగాణ ప్రస్తుతం ఆదాయ మార్గాలు లేక పాలన కుంటుపడిపోయిందన్నారు. స్థానిక సంస్థల్లో లబ్ధికోసమే రైతు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు. రెండుసార్లు రైతులకు రైతు బంధు ఎగ్గొట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని ఎద్దేవా చేశారు.
కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతుబంధు..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతుబంధు అందించి ఆర్థికంగా అండగా నిలిచారని పేర్కొన్నారు. లేనిపోని పథకాలతో ప్రజలను ఆగం చేస్తూ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, పెన్షన్ డబ్బులు ఇప్పిస్తామని కమీషన్ అడిగే వారికి గట్టి గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందని కొత్తగా పథకాలు అమలు చేసేందుకు నిధులు ఎక్కడినుంచి తెస్తారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ బూటక పాలనను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు చీటి వెంకటరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు పహీం, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్