Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 07 : దివ్యాంగుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి మనుగడకు అవసరమైన ఉపకరణాలతో పాటు ఆర్ధిక సాయం కూడా అందిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తుంది. అయితే, ఆచరణలో మాత్రం వారికి శూన్య హస్తమే చూపుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నో ఆశలతో తాము కాంగ్రెస్‌కు ఓట్లేస్తే, అధికారంలోకి రాగానే ఏరుదాటినంక తెప్ప తగలేస్తున్నదన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త పెన్షన్ మంజూరీతో పాటు ఉన్న పెన్షన్ రెండింతలు చేస్తామంటూ మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీ, వారి మనుగడకు అవసరమైన ఆర్థిక సాయం, వారికందించే ఉపకరణాల పంపిణీ కూడా ఆటకెక్కడంతో దివ్యాంగులు కడు దయనీయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో, తమను ఏడాదిన్నర కాలంగా ఊరించి ఉసూరుమనిపిస్తున్న అధికారపార్టీ తీరుతో తమ పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో రూ.200 నుంచి రూ.3వేల దాకా పెరిగిన పెన్షన్ ప్రతినెల టంచన్‌గా వారి ఖాతాల్లో జమ అయ్యేది. దీంతో, అమొత్తాన్ని వారి ఆరోగ్య ఖర్చులతో పాటు ఇతరత్రా అవసరాలకు ఉపయోగించుకునేవారు. పెన్షన్‌కు అర్హులైనవారిని ఎప్పటికప్పుడు ఎంపిక చేస్తూ, లబ్దిదారులుగా అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటిస్తుండేది. కుటుంబ మనుగడ కోసం వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు వీలుగా అర్హులైన అత్యధిక మంది వికలాంగులకు రూ.50 వేల నుంచి రూ.4లక్షల వరకు ఆర్థికసాయమందించింది. పలు స్వచ్ఛంధ సంస్థల సహాకారంతో ఆంగవైకల్యురకు అనేక రకాల ఉపకరణాలు కూడా అందజేసింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన గత ఏడాదిన్నర కాలం నుంచి ఇవేమి తమకందటం లేదనే ఆవేదన వారి నుంచి వ్యక్తమవుతోంది. సాయంకోసం తామెదుర్కొంటున్న సమస్యల కోసం అధికారుల వద్ద కెళ్ళినా కనీస ఉపశమనం కూడా లభించటం లేదని వాపోతున్నారు.
ఆర్థిక, శారీరక ప్రయోజనాల కోసం ప్రజవాణిలో చేసుకునే దరఖాస్తులకు కూడా మోక్షం లభించకపోవటంతో అధికారపార్టీ వ్యవహారశైలిపట్ల దివ్యాంగుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ అయిన పెన్షన్ పెంపు వ్యవహారం కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని మండిపడుతున్నారు.
జిల్లాలో 35 వేలకు పైగా దివ్యాంగులు
జిల్లాలో 35వేలకు పైగా దివ్యాంగులున్నట్లు ఇటీవల ఓ స్వచ్చంద సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడి కాగా, వీరిలో 22,797 మందికి మాత్రమే వికలాంగుల పెన్షన్ అందుతున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ఇప్పటివరకు కొత్త పెన్షన్లకు మోక్షం లభించకపోవటంతో, ఇంకా 5 వేలకు పైగా ధరఖాస్తుదారులు వేచిచూస్తున్నారు. 80శాతం లోపు వైకల్యమున్న వారికి అందజేసే ఉపకరణాలైన రిట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికిల్స్, బ్యాటరీ వీల్ చెయిర్స్, బ్యాట్రీ ట్రై సైకిళ్ళు, ఎల్లో క్రచెస్, వాకింగ్ స్టిక్స్, హియరింగ్ ఎయిడ్స్‌తో పాటు సెల్ఫోన్లు, లాప్‌టాప్‌లు కూడా గత ప్రభుత్వ హాయాంలో ప్రతి ఏటా ఎంపిక చేసిన వారికి అందించేది. 2024-25, 25-26 ఆర్ధిక సంవత్సరాలలో ఇప్పటివరకు అనేక ధరఖాస్తులు వచ్చినా ఎలాంటి స్పందన లేదు. స్వయం ఉపాధి పధకాల ద్వారా ఆర్ధిక సాయం పొంది తమ కుటుంబాలను పోషించుకునేందుకు వందల సంఖ్యలో ధరఖాస్తులు వస్తే, కేవలం 30 మందికి మాత్రమే రూ.50వేల చొప్పున ఇటీవల సాయమందించినట్లు తెలుస్తోంది.
దీంతో, ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలకు, వాటి అమలుపై చూపుతున్న చేతలకు పొంతనలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తాజాగా 40శాతం వైకల్యమున్న వారికి కూడా ఉపకరణాలు అందజేస్తామంటూ దివ్యాంగుల సంక్షేమ శాఖ విధివిధానాలు సవరించగా, ఆశాఖ కార్యదర్శి అనితా రాంచంద్రన్ ఈనెల 3న ఉత్తర్వులు కూడా విడుదల చేశారు. దీంతో, ప్రస్తుతం నిరీక్షిస్తున్న వారికే సాయమందేదెప్పుడో తెలియక సతమతమవుతుంటే, విధి విధానాల సవరింపుతో అర్హులయ్యే వారికి ఫలితాలు అందేదెప్పుడోననే నిర్వేదం వారినుంచి వెలువడుతుండటం గమనార్హం.