కోరుట్ల, మార్చి 24: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు యువకులను మేడిపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోరుట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాములు కేసు వివరాలను వెల్లడించారు. మెట్పల్లి పట్టణానికి చెందిన గోల్కొండ హరీష్, బొల్లంపల్లి అభిషేక్ ఒడిషాకు చెందిన దీపక్ అనే వ్యక్తి వద్ద నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి వాటిని చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారుచేసి జిల్లాలోని మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల పరిసర ప్రాంతాలకు చెందిన యువతకు అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
సోమవారం మేడిపల్లి మండలం ఎస్సారెస్పీ కెనాల్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరి కదలికలను గమనించిన పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకునేందుకు ప్లాన్ వేశారు. వెంబడించిన పోలీసులు కట్లకుంట రోడ్ సమీపంలో పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి 2.2 కేజీల గంజాయి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని గంజాయి విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.
పరారీలో ఉన్న మరో నిందితుడు దీపక్ అలియాస్ సూరజ్ ను త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మేడిపల్లి ఎస్ఐ శ్యామ్ రాజ్, సిబ్బంది చంద్రశేఖర్, మహేశ్వర్, రాజశేఖర్, భగవాన్‌కు నగదు బహుమతి అందజేసి అభినందనలు తెలిపారు. సమావేశంలో కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.