సారంగాపూర్, డిసెంబర్ 13: తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో ఎన్నో మార్పులు వచ్చాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని పెంబట్ల, కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.1.16 కోట్లతో నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే, సానిక ప్రజాప్రతినిధులతో కలిసి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు పాఠశాల విద్యార్థులు కోలాటాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడక ముందు పరిస్థితులు, ఏర్పడిన తర్వాత పరిస్థితులను ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఒక్క సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లోనే 23వేల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారని ఉద్ఘాటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు, చెరువుల మరమ్మతులు చేపట్టడం, కాల్వలకు తూంలు ఏర్పాటు చేయడం, సకాలంలో ఎరువులు అందించడం, పంట పెట్టుబడి సాయం, 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంతో వరిసాగు పెరిగిందని వివరించారు. చెరువులకు తూంలు ఏర్పాటు చేయడంతో చెరువులు జలకళను సంతరించుకున్నాయని అన్నారు. అలాగే ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యా వ్యవస్థ అణిచివేతకు గురైందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జగిత్యాలలో 4 జూనియర్ కళాశాలలు, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.
జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ఆరుగురు విద్యార్థులు ఓవర్సీస్ స్కాలర్ షిప్‌లు పొందారన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల విద్యార్థుల సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కోల శ్రీనివాస్, విండో చైర్మన్ గురునాథం మల్లారెడ్డి, పార్టీ అధ్యక్షుడు గుర్రాల రాజేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ఆకుల జమున, బొడ్డుపెల్లి రాజన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.