మున్సిపోల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ అదరగొడుతున్నది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వానికి తెరపడగా, ఆఖరి రోజూ హోరెత్తించింది. కార్పొరేషన్లు, అన్ని మున్సిపాలిటీల్లో ఇంటింటికీ తిరిగి, బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలను చైతన్యం చేశారు. వీరికి మద్దతుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. నగరాలు, పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిన బీఆర్ఎస్ను మరోసారి దీవించాలని విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకే ఓటేసి, మాయమాటలు, అబద్ధపు హామీలతో దగా చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కోరారు.
కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 9 : మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. ఎన్నికల నియమావళి ప్రకారం.. అన్ని మున్సిపాలిటీల్లో సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వానికి తెరపడింది. ఆఖరి రోజూ హోరెత్తింది. సోమవారం ఆయా పార్టీల అభ్యర్థులు సత్తా చాటారు. పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించి రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారు. ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థులు జోరు సాగించారు. గల్లీలన్నీ చుట్టారు. గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అలాగే అభ్యర్థుల తరఫున మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొని జోష్ నింపారు.
కరీంనగరంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ధర్మపురిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంగనర్, చొప్పదండిలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ హోరెత్తించారు. కేసీఆర్ పాలనలో తెచ్చిన నిధులు, నగరాలు, పట్టణాల్లో చేసిన అభివృద్ధిని, అమలు చేసిన పథకాలను వివరించారు. మళ్లీ బీఆర్ఎస్ రావాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. రెండేళ్లుగా అభివృద్ధి చేయకుండా.. ఇచ్చిన హామీలు అమలు నెరవేర్చకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీ నాయకులు మళ్లీ మాయమాటలు చెబుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పనిచేసిన బీఆర్ఎస్ కావాలో.. పైసా పనిచేయని కాంగ్రెస్ కావాలో.. ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ వస్తేనే మళ్లీ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని, కేసీఆర్ సీఎం అయ్యేందుకు ప్రస్థానం ప్రారంభించాలని కోరారు. దగా చేసిన కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు. లేదంటే తాము పనిచేయకున్న ప్రజల మద్దతు తమకే ఉందని, అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదని, హామీలు నెరవేర్చాల్సిన పని లేదని భావిస్తుందని చెప్పారు. అదే జరిగితే మళ్లీ పన్నెండేళ్లు వెనక్కి వెళ్లే ప్రమాదముంటుందని, అభివృద్ధి కుంటుపడుతుందని హెచ్చరించారు. ఓటు వేసే ముందు బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడా చూడాలని, పనిచేసే వాళ్లనే గెలిపించాలని కోరుతున్నారు.