ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది మున్సిపాలిటీలు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. రేపు(బుధవారం) పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నిషేధాజ్ఞలు అమలుల్లోకి వచ్చాయి. ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లో 48 గంటలపాటు మద్యం విక్రయాలు నిలిపివేశారు. ర్యాలీలు, సభలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలు, లౌడ్ స్పీకర్లు, మైక్‌లు, ప్రచార వాహనాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేధం ఉండనున్నది.
ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరే షన్లో 60 డివిజన్లు, ఆదిలాబాద్‌లో 49 వార్డులు, నిర్మల్ 42, భైంసాలో 26, ఖానాపూర్‌లో 12, లక్షెట్టిపేటలో 15, చెన్నూర్‌లో 18, క్యాతన్‌పల్లిలో 22, బెల్లం పల్లిలో 34, ఆసిఫాబాద్‌లో 20, కాగజ్‌నగర్‌లో 30 వార్డులకు ఎన్నికలు నిర్వహిం చనున్నారు. ఎన్నికల నిర్వహణకు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 265 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా, మిగిలిన పది మున్సిపాలిటీల్లో 672 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించను న్నారు. ఈ మేరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
రేపటి పోలింగ్ నేపథ్యంలో నేడు ఎన్నికల సామగ్రి పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు డిప్లాయింగ్ కేంద్రాల సమీపంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. ఎన్నికల వాతావరణాన్ని ఉద్రిక్తం చేసే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కవ్వింపు చర్యలు, గొడవలకు దారి తీసే ప్రవర్తన ఉంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపా రు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి, 13వ తేదీ ఫలితాల వెల్లడయ్యే వరకు ఇవే ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.
కీలకంగా మారిన 48 గంటలు
ఎన్నికల ప్రచారం ఒకెత్తయితే, ఈ రెండు రోజులు గెలుపు, ఓటములు నిర్ణయించే అవకాశం ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొన్నది. తమ డివిజన్లో ఉన్న ఓట్లు ఎన్ని.. ఏ పక్షం వైపు ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు. న్యూటల్గా ఉండి కీలకంగా మారే ఓటర్లు ఎవ్వరన్న అంచనాల్లో అభ్యర్థులు తలమునకలయ్యారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు డబ్బులు, మద్యం పంచేందుకు కొత్త పంథాలో ముందుకు వెళ్తున్నారు. ఓటర్లకు డిజిటల్ పేమెంట్లు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.
మద్యం రవాణ చేయకుండా ఓ దగ్గర పెట్టి అక్కడికి వెళ్లి తీసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మరి కొందరేమో ఓటర్ స్లిప్‌ల పంపిణీ పేరిట గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు అప్పజెప్తున్నారు. ఓటర్ స్లిప్ వెనకాల ఓ కోడ్ లేదా సంతకం పెట్టి ఇచ్చి, ఫలాన వ్యక్తిని కలవాలని చెప్తున్నారు. ఆ స్లిప్‌తో చెప్పిన వారిని కలిస్తే డబ్బుతోపాటు మద్యం బాటిల్ అందజేస్తారు. మంచిర్యాల కార్పొరేషన్‌సహా పలు మున్సిపాలిటీల్లో చాలా చోట్ల ఇదే తరహాలో ఓటర్ల ప్రలోభాలు సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఓటర్లకు డబ్బుల పంపిణీ పూర్తయ్యింది.
ప్రచారం ముగిశాక నిఘా ఎక్కువగా ఉంటుందని ముందే గ్రహించిన అభ్యర్థులు ప్రచారంతోపాటు పంపకాలు కానిచ్చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ.2000 ఇస్తే.. మరికొన్ని చోట్ల రూ.3000 నుంచి రూ.5000 వరకు ఇస్తున్నారు. డబ్బులు తీసుకోడానికి ఇష్టపడని వారిని నాలుగైదు రోజులుగా దావత్‌లు ఇస్తున్నారు. గెలిస్తే గోవ, బ్యాంకాంగ్ వెళ్దామంటూ పలువురు అభ్యర్థులు ఆఫర్లు ఇస్తున్నారు. పాత మంచిర్యాల, రంగంపేట, రాళ్లపేట ప్రాంతాలకు చెందిన పలు డివిజన్లలో ఓ పార్టీకి చెందిన నాయకులు ఒక్కో ఓటుకు రూ.2000 వరకు ముట్టచెప్పారు. పైపెచ్చు మద్యం పంపిణీ, దావత్‌లు ఆఫర్ చేస్తున్నారు. మంచిర్యాల రైల్వే ఫ్లై ఓవర్ అవతలి పక్క ప్రాంతంలో ఓ పార్టీ అభ్యర్థి డబ్బులు పంచుతుంటే ప్రత్యర్థి పార్టీ లీడర్లు అడ్డుకున్నారు.
ఈ మేరకు ఇరువర్గాలు గొడవపడే వరకు వెళ్లింది. బైపాస్‌రోడ్డులోని ఓ ప్రాంతం నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఓటర్ స్లిప్‌ల వెనకాల సంతకం చేసి ఇస్తున్నారు. ఆయన చెప్పిన వారికి కలిసి ఆ స్లిప్ చూపిస్తే ఓటుకు క్వార్టర్ సీసాతోపాటు ఓటుకు ఇంత చొప్పున పైసలు ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. పోలింగ్‌కు ఒకరోజు ముందైన మంగళవారం ప్రలోభాల పర్వం కొనసాగనున్న నేపథ్యంలో ఓటర్లు ప్రభావితం కాకుండా డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వ్యూహాత్మకంగా ప్రచారం
బీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నిర్మల్ పట్టణంలో పది రోజులుగా మకాం వేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం అహర్నిషలు కృషి చేశారు. ఖానాపూర్‌లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భుక్యా జాన్సన్ నాయక్ బల మైన అభ్యర్థులను బరిలో దింపి విస్తృత ప్రచారం చేశారు. భైంసా పట్టణం లో ఎన్నికల ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న మాజీ మేయర్ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మరంగా ప్రచారం చేశారు.
నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ పడకంటి రమాదేవి, విలాస్‌గాదేవార్, లోలం శ్యాంసుందర్, కిరణ్కొమ్రేవార్లు ప్రచారం చేపట్టారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్నతోపాటు నాయకులు, కార్యకర్తలు వార్డుల్లో ఇంటింటా ప్రచారం చేశారు. మున్సిపాలిటీలో 49 వార్డులకు ఇన్చార్జిలను నియ మించగా.. వారు ప్రచార బాధ్యతలు నిర్వహించారు. రామన్న వార్డుల్లో ప్రచార రథంపై తిరుగుతూ బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. ప్రతి వార్డులో ప్రజలు మాజీమంత్రి ప్రచారానికి భారీ సంఖ్యలో తరలివచ్చి తమ మద్దతు తెలియజేశారు.
నిర్మల్‌లో విపరీతంగా మద్యం అమ్మకాలు
వారం రోజుల్లో ఆదిలాబాద్ ఐఎంఎల్ డిపో నుంచి రూ.11 కోట్లకు పైగా విలువ గల లిక్కర్‌ను ఇక్కడి మద్యం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. 30 వేల లిక్కర్ కేసులు, 22 వేల బీరు కేసులు కొనుగోలు చేయగా, ఇందులో నిర్మల్ సర్కిల్ పరిధిలో రూ.7.15 కోట్లు, భైంసా సర్కిల్ పరిధిలో రూ.3.85 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. పోలింగ్‌కు ఒకరోజు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులకు ఈ 24 గంటలు కీలకంగా మారాయి. గెలుపోటములు నిర్ణయించే సమయం కావడంతో అభ్యర్థులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
నేడు సామగ్రి పంపిణీ
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 49 వార్డులకు ఎన్నికలు జరగనుండగా.. నేడు(మంగళవారం) టీటీడీసీలో సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నారు. 216 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 216 పోలింగ్ బాక్స్లతోపాటు 20 శాతం బాక్స్‌లను ఎక్కువగా అందుబాటులో ఉంచారు. 260 మంది పీవోలు, 260 మంది ఏపీవోలు, 778 మంది ఓపీవోలు విధులు నిర్వహించనున్నారు.
మూగబోయిన మైక్‌లు
మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్‌కు 36 గంటల సమయం ముందుగానే ప్రచారం ముగియడంతో మైక్‌లు మూగబోయా యి. ప్రచార పర్వానికి తెరపడడంతో పోలీసులు, అధికార యంత్రాంగం ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటి కే పోలింగ్ స్టేషన్లను గుర్తించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందు కు కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.