Jagtial : జగిత్యాల, జూన్ 08 : తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు, న్యాయవాది హరి ఆశోక్ కుమార్ (Ashok Kumar) ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో 16 మంది వివిధ రంగాలకు చెందిన మహిళలను రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, హరి ఆశోక్ కుమార్, పి హన్మంత రెడ్డిలు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై మాట్లాడారు. కార్యాలయాల్లో, కంపెనీల్లో మహిళా ఉద్యోగినులు వేధింపులకు గురైతే ధైర్యంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేధింపుల నిరోధక కమిటీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. కమిటీ సిఫార్సు మేరకు వేధింపులకు పాల్పడిన నిందితులకు రూ.50 వేల జరిమానా విధిస్తారని, పదోన్నతులు నిలిపి వేయడం, సస్పెన్షన్ కూడా సాధ్యమేనని అశోక్ తెలిపారు.
అంతేకాదు బాధిత మహిళ ఎవరైనా క్రిమినల్ కేసు పెట్టాలనుకుంటే.. ఆమెకు అధికారులు పూర్తిగా సహకరించాలని ఆయన అన్నారు. మహిళలు సఖి కేంద్రంను వినియోగించు కోవాలని సూచించారు. ఈ సదస్సులో రిటైర్డ్ తహశీల్దార్ పిసి హన్మంత్ రెడ్డి, శ్రావణి సంస్థ అధ్యక్షుడు దిండిగాల విఠల్, మహిళా సంఘాల జేఏసీ జిల్లా నేతలు కస్తూరి శ్రీమంజరి, గంగం జలజ, సింగం పద్మ, బక్కశెట్టి లక్ష్మీ, బైరి రాధ, విజయ, తదితరులు పాల్గొన్నారు.