SIT Office | ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో ఏ1 అయిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో మాసబ్ ట్యాంక్ నుంచి మళ్లీ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కి సిట్ ఆఫీస్‌ను మార్చారు. రెండునెలల పాటు వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నుంచి పని చేసిన సిట్.. ఇకపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ నుంచి పని చేయనున్నది. ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సిట్ కార్యాలయాన్ని మార్చడం ఉత్కంఠ నెలకొంది.
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి దుబాయి మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై పంజాగుట్ట పీఎస్‌లో గతేడాది కేసు నమోదైన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కోసం అధికారులు సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన కొద్ది రోజులకు ప్రభాకర్‌రావు అమెరికా వెళ్లిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు నలుగురిని అరెస్టు చేశారు. వారిచ్చిన వాంగ్మూలం మేరకు ప్రభాకర్‌రావును భారత్ రప్పించేందుకు పోలీసులు ప్రయత్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికా నుంచి ప్రభాకర్‌రావు భారత్‌కు వచ్చారు. ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్‌తో ప్రభాకర్‌రావు భారత్‌కు చేరుకున్నారు.