మల్లాపూర్, ఆగస్టు 26: పాఠశాల సమయం వేళలో సకాలంలో ఆర్టీసీ బస్సులు నడపాలంటూ ఆదర్శ పాఠశాల విద్యార్థులు (Students) ధర్నాకు దిగారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్లోని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్కూల్ టైమింగ్స్‌కు అనుగుణంగా బస్సులు నడపాలని, ఒక్కోసారి రాత్రి వరకు వేచి ఉండాల్సి వస్తున్నదని ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు సరైన సమయంలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అలాగే పాఠశాల ముగిసిన తర్వాత ఆదర్శ పాఠశాల బస్టాండ్ వద్ద రాత్రి సమయం వరకు బస్సు కోసం వేచి ఉంటున్నామని, దీంతో రోడ్డుపై వచ్చి పోయే ఆకతాయిలు మద్యం సేవించి తమను తరచూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలన్నారు.