Quality education | కోరుట్ల, మే 2: విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాల్సిన గురుతరమైన బాధ్యత అధ్యాపకులపై ఉందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు.పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్, అధ్యాపకులతో ఇంటర్ మీడియట్ పరీక్ష ఫలితాలపై ఎమ్మెల్యే శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత సాధించకపోవడం బాధాకరమన్నారు.
ప్రభుత్వ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్న విద్యార్థులు వెనుకబడి పోవడానికి కారణాలను అన్వేషించాలన్నారు. మల్లాపూర్ మండలానికి చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కేవలం ఐదు శాతం ఉత్తీర్ణత సాధించడం పై అధ్యాపకులను మందలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుల బోధన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులను గాడిలో పెట్టాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందని నొక్కి చెప్పారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలన్నారు.
విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులకు సూచనలు అందిస్తూ జవాబుదారీగా నిలవాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందని పేర్కొన్నారు. అధ్యాపకులు తమ విద్యాబోధనలో ఎలాంటి లోపం లేదని విద్యార్థులు కళాశాలకు సక్రమంగా హాజరు కావడం లేదని, కళాశాలలో మౌలిక సదుపాయాలు లేవని పలువురు అధ్యాపకులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని, అవసరమైన బాత్రూములు, మరుగుదొడ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా నోడల్ అధికారి నారాయణ, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మండలాలకు చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.