కోరుట్ల రూరల్: కాంగ్రెస్ పాలనతో అన్నతలకు విత్తనాల బాధ తప్పడం లేదు. ప్రభుత్వం అలసత్వం, అధికారుల్లో సన్నదత లేకపోవడంతో తొలకరి కురిసినా విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. రోజూ తెల్లారకముందే వ్యవసాయ కార్యాలయాల వద్ద విత్తనాల కోసం క్యూలైన్లు కడుతున్నారు. తమ వంతు కోసం నిరీక్షించి.. పాసు పుస్తకాలు, చెప్పులను వరుసలో పెడుతున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో జీలుగు (Korutla) విత్తనాల కోసం రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. కోరుట్ల వ్యవసాయ కార్యాలయం ముందు విత్తనాల కోసం రైతులు పట్టాదార్ పాస్‌పుస్తకాలను క్యూ లైన్లలో పెట్టారు. పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో జీలుగు విత్తనాల కోసం తరలి వచ్చారు. దీంతో కార్యాలయం తెరువక ముందే గేటు నుంచి పట్టా పాస్ బుక్‌లను క్యూ లైన్లో ఉంచి ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీలుగు విత్తనాలకు ఇబ్బందులు లేకుండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిలుగు విత్తనాలకు ఇబ్బంది పడాల్సి వస్తుందని, విత్తనాల రేటు కూడా రెండింతలు చేశారని రైతులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అగ్రికల్చర్ ఆఫీస్‌కు వెళ్లేలోపు కార్యాలయ సిబ్బంది పట్టాదార్ పాస్ బుక్‌లను తీసుకెళ్లారు.