జగిత్యాల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంపట్నం మండలం గోదూరుకు చెందిన మెట్టు నర్సు (55) అనే మహిళ గ్రామ శివారు సబ్ స్టేషన్ సమీపంలోని తమ వ్యవసాయ పొలంలో పనికి వెళ్లింది. కాగా,రాత్రి అయినా ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా నర్సు వ్యవసాయ పొలంలో రక్తపు మడుగులో పడిఉంది.
తలకు బలమైన గాయంతో ఆమె మృతి చెందింది. బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఆమెను దుండగులు హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మెట్పల్లి డీఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐ లక్ష్మీనారాయణ, ఇబ్రహీంపట్నం ఎస్ఐ ఉమాసాగర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.