కోరుట్ల, జనవరి 6 : రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలని కోరుట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రియాజ్ పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని కేరళ హై స్కూల్, సాయి జీనియస్ హైస్కూల్లో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి హాజరైన రియాజ్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు అతిక్రమించి మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులకు రూ.25 వేల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.
వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. సీట్ బెల్ట్ ధరించాలని మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దన్నారు. రోడ్డు ప్రమాదాలకు వాహనదారుల భద్రత అవగాహన లోపం, అతివేగం ఒక కారణమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఆయా కార్యక్రమంలో కేరళ హై స్కూల్ కరస్పాండెంట్ మహమ్మద్ అబ్దుల్ బారి, ప్రిన్సిపల్ సెలీనా, సాయి జీనియస్ పాఠశాల కరస్పాండెంట్ చౌకి రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.