సారంగాపూర్, జనవరి 6 : ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాలను పెంచాలని జిల్లా ఉప వైద్యాధికారి ముస్కు జైపాల్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలని అన్నారు. గ్రామాల్లో రక్తపరీక్షలు నిర్వహించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి తమవంతు కృషి చేయాలన్నారు.
ఆరోగ్య కేంద్రంలో, ఆయా గ్రామాల్లో వైద్య సేవలపై ఆరా తీసారు. ఆరోగ్య కేంద్రంలో రికార్డులను, మందులు, వైద్య పరికరాలు, వైద్యశాల పరిసరాలు పరిశీలించి వివరాలు తెల్సుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటు మెరుగైన వైద్య సేవలు అందించాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాధ, సీహెచ్ కుద్దుస్, సూపర్ వైజర్లు కిశోర్, తార, భారతి, నర్సింగ్ అధికారి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.