జగిత్యాల, మార్చి 25 : అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టపోయిన రైతులను పరామర్శించే తీరిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు లేదా అని ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోతే ఏ ఒక్క మంత్రి కూడా రైతుల దగ్గరకు వెళ్లి పరామర్శించి భరోసా కల్పించలేదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై మండిపడ్డారు.
16 నెలల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో మాట్లాడితే దాటవేసే ధోరణిలో ఉన్నారే తప్ప, సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు విపరీతంగా పెరిగాయని, కాంగ్రెస్ 16 నెలల పాలనలో 1లక్ష 58 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని అన్నారు. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇంత స్వల్పకాలంలో ఈ స్థాయిలో అప్పులు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందన్నారు.
2 లక్షల రైతు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారని, ఏ గ్రామానికి వెళ్లిన మాకు రుణమాఫీ జరగలేదని చాలా మంది రైతులు చెబుతున్నారని, ప్రభుత్వం మాత్రం అందరికి ఇచ్చామని చేతులు ఎత్తేసినట్లు కనబడుతుందన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు వెళ్లి పరిశీలిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఏఒక్కరు రైతుల దగ్గరకు వెళ్లడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్ల సాగునీరు సరిగ్గా అందక, విద్యుత్తు సరిగా లేకా లక్షలాది ఎకరాల పంటలు ఎండిపోయిందన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ దావా వసంత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.