కోరుట్ల, జనవరి 13: సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా బీఆర్ఎస్ పని చేస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న లేకున్నా ప్రజల పక్షాన పోరాడుతుందని చెప్పారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి ధరి చేరేలా కృషి చేస్తుందన్నారు. అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికుల కోసం తాను సొంతంగా గ్రూప్ ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.
దేశంలోనే ఎక్కడాలేని విధంగా కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో వస్త్ర, కిరాణ, సెల్ఫోన్, ఇతర దుకాణాల్లో పని చేస్తున్న కార్మికులను ఆదుకునేందుకు ప్రమాద బీమా సౌకర్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆయా రంగాల్లో పని చేస్తున్న కార్మికులందరిని ఒక్క తాటిపైకి తీసుకు వచ్చి వారికంటూ ఓ గుర్తింపునూ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికుందరిని సంఘటితం చేసి వారి పేర్లు నమోదు చేసుకొని ఇన్సూరెన్స్ అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార యుద్ధంలో కత్తి లేకుండా పని చేస్తున్నానని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించి మరింత ఆత్మవిశ్వాసంతో పోరాటం చేసేందుకు అధికారమనే ఆయుధాన్ని అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ లో అక్రమార్కులకు చోటు లేదని స్పష్టం చేశారు. కోరుట్లను మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరు కలిసికట్టుగా నిజాయితీపరులకు ఓటు వేసి గెలిపించు కోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రాజేష్, మనోహర్, ఫహీం, అతిక్, వెంకట్రావు, సత్యం, ఆనంద్, వినోద్ కుమార్, మురళి, తదితరులు పాల్గొన్నారు.