కోరుట్ల, జనవరి 6 : విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. మంగళవారంక కోరుట్ల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పిఆర్బిఎం జూనియర్ కళాశాల విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి కోరుట్ల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో చదివితే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసి కష్టపడి చదివిస్తారని, వారి ఆశలను మమ్ము చేయకుండా క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు.
దురలవాట్లకు దూరంగా ఉండాలని, చదువులో రాణిస్తూ గురువులు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. వార్షిక పరీక్షలకు ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో సమాయత్తం కావాలన్నారు. సమాజంలో గుర్తింపు పొందేందుకు విద్యే ప్రధాన ఆయుధమని ఎమ్మెల్యే వివరించారు. కులం, మతం అనే వ్యత్యాసాలు లేకుండా ఐక్యతతో ముందుకు సాగినప్పుడే సమ సమాజ అభివృద్ధి సాధ్యమవు తుందని చెప్పారు. భారతదేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పోతని ప్రవీణ్ కుమార్, శిక్షకులు రంజిత్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.