ఇబ్రహీంపట్నం : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఇటీవలే ఇబ్రహీంపట్నం మండలంలో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ కొనుగోలు జరగకపోవడంతో ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మార్క్ఫెడ్ డీఎంతో మాట్లాడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. నిల్వలో ఉన్న మక్కలను కొనుగోలు చేయడంలో ఆలస్యం జరుగుతోందని, మార్కెట్ యార్డు మొత్తం మక్కలతో నిండిపోయిందన్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం ఇంచు స్థలం కూడా లేకపోవడం వల్ల రైతులు తమ పంటను విక్రయించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు తమ పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. వర్షాలు పడితే రైతులకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలుకు కూడా మార్కెట్లో సరిపడా సదుపాయాలు లేవని, రైతులకు ఎన్నికల సమయంలో ఆశ చూపించి చివరికి వెన్నుపోటు పొడుస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రైతుబంధు సకాలంలో అందడం లేదని, యూరియా కొరత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిందని తెలిపారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రైతుబంధు సకాలంలో అందించడమే కాకుండా, ఎరువుల కొరత లేకుండా చూసుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలేచి వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.