కోరుట్ల, మార్చి 23: కోరుట్ల పోలీస్ సర్కిల్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మెట్పల్లి డీఎస్పీ రాములు తెలిపారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సురక్షిత ప్రయాణం’ కార్యక్రమంలో భాగంగా సర్కిల్ పరిధిలోని మేడిపల్లి, కోరుట్లను అనుకొని జాతీయ రహదారితో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రమాదకరమైన మూలమలుపుల వద్ద వాహనదారుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు అధికారులతో సమీక్షించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలు(బ్లాక్ స్పాట్) ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఏరియా, నంది చౌరస్తా, కొత్త బస్టాండ్ ఏరియా, మాదాపూర్ క్రాస్ రోడ్, గుమ్లాపూర్ క్రాస్ రోడ్, మోహన్ రావు పేట క్రాస్ రోడ్, మేడిపల్లి ఎల్లమ్మ టెంపుల్, దాంబర్ ప్లాంట్ పీఎన్ఆర్ గార్డెన్, ఏరియాలను డీఎస్పీ పరిశీలించారు.
ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ,ట్రాఫిక్ సిగ్నల్, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు కోసం తగు సూచనలు ఇచ్చారు. మున్సిపల్, రోడ్లు భవనాల శాఖ, నేషనల్ హైవే అథారిటీలతో సమన్వయం చేసుకోని రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజల విలువైన ప్రాణాలు కాపాడేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్పీ వెంట కోరుట్ల సీఐ సురేష్ బాబు, కోరుట్ల మేడిపల్లి ఎస్సైలు రామచంద్రం, శ్యామ్ రాజ్ ఉన్నారు.