మల్యాల, జూన్ 04 : కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది.. కాంగ్రెస్ సర్కార్‌లో రైతు బంధు లేదు…. రుణమాఫీ లేదు… కేసీఆర్ ను ఏమైనా అంటే పురుగుల పడి చస్తారంటూ జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సంఘ ఎర్రన్న, సామ గంగారెడ్డి అనే రైతులు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తిస్థాయి వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు ఒద్దినేని హరిచరణ్ రావు వాళ్ల తండ్రి సురేందర్‌రావు ఇటీవల మృతిచెందగా బుధవారం మేడిపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ వెళ్లి పరామర్శించి కరీంనగర్ తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే మల్యాల మండలంలోని రాంపూర్ గ్రామంలోని ప్రధాన బస్టాండ్ చౌరస్తా నుంచి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌లు వెళుతున్న క్రమంలో గమనించిన రైతులు అభివాదం చేయడంతో పాటు వాహనాలను ప్రేమతో ఆపగా వారు ఆగారు, తమవంతుగా సార్ మీకు చాయ్ తాగిపిస్తామని, ఆహ్వానాన్ని మన్నించండని అనడంతో వినోద్ కుమార్ సరే అని అన్నారు. ఈ నేపథ్యంలోనే రాంపూర్ గ్రామానికి చెందిన సంఘ ఎర్రన్న అనే రైతు ప్రజలందరూ కేసీఆర్ ని యాది చేస్తున్నారని, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉందని, మళ్లీ కేసీఆర్‌నే అధికారంలోకి వస్తాడని తమ అభిప్రాయాన్ని వినోద్ కుమార్ తో పంచుకున్నాడు.
అనంతరం సామ గంగారెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. తనకున్న భూమిని సాగు చేసుకునేందుకు గతంలో 10 కరెంటు మోటార్లను నడిపే వాడినని, మా గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మించడంతోపాటు వరద కాలువకు పంప్ హౌస్‌ల నిర్మించడం వల్ల భూమిలో సైతం నీటి నిలువ ఎక్కువగా ఉందన్నారు. సాగునీరు, నాణ్యమైన విద్యుత్ ఉండడం వల్ల పది మోటర్ల స్థానంలో మూడు మోటార్లను మాత్రమే వినియోగిస్తున్నాని తెలిపారు. తనకు ఈ యాసంగి పంటకు రైతుబంధు రాలేదని, రుణమాఫీ సైతం అమలు కాలేదని, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని, కేసీఆర్ ను ఏమైనా అంటే పురుగుల పడి చస్తారంటూ తన ఆవేదనను వెలిబుచ్చాడు. అనంతరం చాయ్ తాగుతూ వినోద్ కుమార్ రాజస్థాన్ హోటల్ యజమానితో గిరాకీ ఎలా ఉంది.. ఏఏ వస్తువులు తయారు చేస్తారంటూ అడిగి తెలుసుకున్నారు. ఆ తదుపరి రైతులతో మాట్లాడుతూ.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సంపదను పెంపొందించేందుకుగాను కేసీఆర్ పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశామన్నారు. ఇందుకు ఉదాహరణగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యక్తులలో పట్టణాల తరహాలో అభిరుచులు, అభిప్రాయాలు మారడమే ప్రత్యేక ఉదాహరణ అన్నారు. అబ్దుల్ కలాం ఆజాద్ ఒకప్పుడు పూరా ( ప్రొవైడింగ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియా) అమలు చేయాలని భావనతో ఉండే వారని, ఇప్పుడు పల్లెలను చూస్తే పట్టణాల తరహాలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఇందుకు ప్రత్యేక కారణం గ్రామీణ స్థాయిలో నివసించే వ్యక్తుల యొక్క ఆర్థిక అభివృద్ధి రేటును పెంపొందించడమే ప్రత్యేక ఉదాహరణ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పథకాల అమలుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున కొంత సమయం ఇస్తున్నామని, రాబోవు రోజుల్లో హామీలు అమలుకై ఉద్యమం తరహాలో ప్రతిపక్ష ప్రతిపక్ష పాత్రను పోషిస్తామన్నారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో నష్టపోయే రైతులను సైతం కలుపుకొని నిరసనలు తెలుపుతామని, ఇందుకుగాను మీలాంటి రైతుల సహకారం సైతం భవిష్యత్తులో అవసరం ఉంటుందన్నారు. రాబోయే రోజులు బీఆర్ఎస్ పార్టీవే నని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు.