జగిత్యాల, మే 5: రైతులను రెచ్చ గొట్టడం కాదని, ఆపదలో ఉన్న రైతులకు అండగా నిలవడం ప్రభుత్వాల బాధ్యత అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల రూరల్ మండలం చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎమ్మేల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షానికి తడిసిపోవడం చాలా బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ధైర్యంగా సాహసోపేత నిర్ణయం తీసుకుని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని, రైతులు అధైర్య పడొద్దని భరోసా నిచ్చారు.
తడిసిన ధాన్యం ఆరబెట్టేందుకు చర్యలు చేపట్టాలని, అధికారులతో తాను మాట్లాడతానని హామీ ఇచ్చారు.
రైతులు అకాల వర్షాల దృష్ట్యా ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ వర్షానికి టార్పాలిన్ కవర్లు కప్పుకొవాలని, ఎండకి ధాన్యాన్ని ఆరబెట్టాలని సూచించారు. రైతుల పక్షాన నిలిచి వారికి అండగా ఉంటామని రైతులు ధైర్యంగా ఉండాలని అన్నారు. ఎమ్మేల్యే వెంట జగిత్యాల పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, హస్నాబాద్ సర్పంచ్ లక్ష్మణ్ రావు, ఎంపీటీసీ మల్లారెడ్డి, చల్గల్ ఉప సర్పంచ్ పద్మ, తిరుపతి, నాయకులు రాజ రెడ్డి, తిరుపతి, రైతులు తదితరులు ఉన్నారు.