రాయికల్, జూన్ 27: సకల సౌకర్యాలతో ప్రజలకు ఒకేచోట కూరగాయలు, పండ్లు, మాంసం, పువ్వులు, విక్రయించేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ (Integrated Market) నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం టీయూఎఫ్‌డీసీ నిధుల నుంచి రూ.3కోట్ల నిధులు సైతం మంజూరయ్యాయి. అయితే సమీకృత మార్కెట్ నిర్మాణానికి మొదట వ్యవసాయ మార్కెట్ వద్ద స్థలాన్ని ఎంపిక చేయడం అక్కడ రైతులు విభేదించడంతో మార్కెట్ నిర్మాణం ఆగింది. దీంతో అనువైన స్థలం దొరకకపోవడంతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి మోక్షం కలగడం లేదు.
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రతి మున్సిపాలిటీలో సకల సౌకర్యాలతో ప్రజలకు కావలసిన అన్ని వస్తువులు ఓకే చోట దొరికేందుకు సమీకృత మార్కెట్లను నిర్మించేందుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మార్కెట్ నిర్మాణం కోసం మూడు కోట్ల నిధులను సైతం అప్పటి ప్రభుత్వం వెచ్చించింది. కాగా మార్కెట్ నిర్మాణం కోసం రాయికల్ పట్టణ శివారులోని మార్కెట్ యార్డులో 20 గుంటల స్థలాన్ని అప్పటి జిల్లా కలెక్టర్ రవినాయక్ స్థలాన్ని ఎంపిక చేశారు. టెండర్ పక్రియ కూడా చేపట్టారు. అయితే ఇంతవరకు బాగున్న అసలు సమస్య ఇక్కడే మొదలయింది. మార్కెట్ యార్డ్ వద్ద సమీకృత మార్కెట్ నిర్మిస్తే పట్టణానికి దూరంగా ఉండడం ఒక సమస్య అయితే, మార్కెట్ యార్డులో సమీకృత మార్కెట్ నిర్మిస్తే రైతులకు స్థలం సరిపోదని రైతులు అడ్డు చెప్పారు. దీంతో టెండర్ దక్కించుకున్న అధికారులు కాంట్రాక్టర్ దిక్కు తోచని స్థితిలో పడ్డారు. మార్కెట్ నిర్మాణానికి టెండర్ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఈ గందరగోళ పరిస్థితిని చూసి పనులు చేసేందుకు ముందుకు రాకపోవడంతో రైకల్ సమీకృత మార్కెట్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
స్థలమే అసలు సమస్య..
రాయికల్ మున్సిపల్ పరిధిలో సమీకృత మార్కెట్ నిర్మాణం కోసం అనువైన స్థలం దొరకడం లేదు. ఒకవేళ సమీకృత మార్కెట్‌ను గ్రామ శివారులో ఎక్కడైనా నిర్మిస్తే పట్టణ ప్రజలు దూర భావం వల్ల అక్కడికి వెళ్లారనే అభిప్రాయాలు సైతం ప్రజల నుంచి వస్తున్నాయి. మరోపక్క మంజూరైన రూ.3కోట్ల నిధులు తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తే సమీకృత మార్కెట్ నిర్మాణం కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. మున్సిపల్ పరిధిలో 20 గుంటల స్థలం సైతం లేకపోవడంతో సమీకృత మార్కెట్ ఏర్పాటు కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి తోడు మున్సిపాలిటీలో ప్రతి శనివారం జరిగే వారసంత క్రయవిక్రయాలు రోడ్డుపైనే నిర్వహించడంతో, స్థానిక పాత బస్టాండ్ నుంచి ఇటిక్యాల క్రాసింగ్ రోడ్ వరకు ప్రతి శనివారం ట్రాఫిక్ జామ్‌తో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూరగాయలు, మాంసం విక్రయాల కోసం రూ.42లక్షల వ్యయంతో మార్కెట్ భవనం నిర్మించినా, కూరగాయల వ్యాపారులు, మాంసం విక్ర యదారులు ఈ భవనాన్ని వినియోగించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పట్టణ పరిధిలో ప్రజలకు అందుబాటులో సమీకృత మార్కెట్‌ను త్వరగా నిర్మించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ప్రజలకు అందుబాటులో సమీకృత మార్కెట్‌ను నిర్మించాలి
ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సమీకృత మార్కెట్‌ను నిర్మించాలని పట్టణానికి చెందిన పాలేపు నాగరాజు అన్నారు. సమీకృత మార్కెట్ నిర్మాణానికి మూడు కోట్లు నిధులు మంజూరైన నిర్మాణం జరగడం లేదు. రాయికల్ మేజర్ గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ గా మారిన పట్టణ ప్రజలకు సరైన అన్ని రకాల వస్తువులు దొరికే మార్కెట్ లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి సమికృత మార్కెట్ ను నిర్మాణం జరిగేలా చూడాలన్నారు.
స్థలం దొరక్క ఇబ్బందులు
సమీకృత మార్కెట్ నిర్మాణానికి స్థలం దొరక కపోవడంతోనే నిర్మాణంలో జాప్యం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ మనోహర్ అన్నారు. రాయికల్ పట్టణంలో టీయూఎఫ్‌డీసీ నిధులు రూ.3కోట్లతో మంజూరైనా సమీకృత మార్కెట్ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉం డేలా స్థలం కోసం అన్వేషణ చేస్తున్నాం. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే సమీకృత మార్కెట్ నిర్మాణం జరిగేలా తగు చర్యలు చేపడతామని వెల్లడించారు.