జగిత్యాల : సీఎం కేసీఆర్ రైతులు, మహిళల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు అన్నారు. కథలాపూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం, ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ, అంగన్వాడీ , ఆయాలకు యూనిఫాం (సారీస్), కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయాన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిరంతరం రైతులు, మహిళల సంక్షేమానికి పరితపిస్తారన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
త్వరలోనే 704 కోట్ల రూపాయలతో వరద కాలువ లిఫ్టు ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. ఆహార భద్రత అంశం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం అయినప్పటికి కేంద్రం రైతులను అయోమయానికి గురిచేస్తుందని ఆరోపించారు.
అలాగే రాష్ట్రంలో సొంత స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు. ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎంపీపీ జవ్వాజి రేవతి, జడ్పిటిసి నాగం భూమయ్య, మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.