వరంగల్‌చౌరస్తా, ఫిబ్రవరి14 : ‘వంగ లేక మంగళవారం’ అన్నట్లుగా ఉంది వరంగల్ ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ తీరు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిని శిక్షించకుండా, వెనకేసువచ్చే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారు. శుక్రవారం రాత్రి ఎంజీఎం దవాఖానలో మృతిచెందిన కాంతారావు మృతదేహాన్ని కుటుంబసభ్యులు చేతులమీదే అంబులెన్స్ వరకు తరలించడాన్ని మీడియా కావాలనే ఉద్దేశపూర్వకంగా ముందస్తు ప్రణాళిక ప్రకారం చిత్రీకరించిందని వంకరగా మాట్లాడారు.
శనివారం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనానికి ఉన్నతాధికారులు వివరణ కోరడంతో వారు చేసిన తప్పును పూర్తిగా మీడియాపైకి నెట్టే ప్రయత్నం చేశారు. శనివారం మధ్యాహ్నం ఎంజీఎం దవాఖాన కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మృతుడి వివరాలు తెలియజేస్తూ కొందరు మీడియా వ్యక్తులు కావాలనే ముందస్తు సమాచారంతో అక్కడి చేరుకొని ఆ దృశ్యాన్ని చిత్రీకరించి ప్రభుత్వాన్ని, ఎంజీఎం దవాఖానలో అందుతున్న సేవలను తప్పుగా చూపే ప్రయత్నం చేశారని అన్నారు.
ఆయన సమాధానానికి మీడియా స్పందించింది. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారా.. మృతదేహాన్ని తరలించిన సమయంలో క్యాజువాలిటీలో ఎంతమంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఎన్ని స్ట్రెచర్లు అందుబాటులో ఉన్నాయి.. చికిత్స పొందుతున్న వ్యక్తి చనిపోయిన సమయానికి, అధికారులు కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించిన సమాయానికి మధ్య ఉన్న తేడా ఎంత? మీడియా చిత్రీకరించిన వీడియోలో మృతదేహాన్ని తరలిస్తున్నపుడు స్పందించకుండా సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరించిన తీరును గమనించారా..?, మీడియా ప్రతినిధులు వీడియో చిత్రీకరించిన తదుపరి పేషెంట్ కేర్ సిబ్బందిని మందలించిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారా? అనే ప్రశ్నలకు సూపరింటెండెంట్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఈ ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిని రక్షించేందుకు మీడియాపైనే బురదజల్లే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా జరిగిన ఘటనపై పూర్తిగా విచారణ జరిపి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.